
అడవుల సంరక్షణకు ప్రాధాన్యం
ఒంగోలు సబర్బన్: అడవుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పి.రాజాబాబు పేర్కొన్నారు. వివిధ విభాగాల అటవీ శాఖ అధికారులతో, పర్యాటక శాఖ అధికారులతో మంగళవారం ఆయన ప్రకాశం భవన్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అడవుల సంరక్షణతో పాటు పర్యాటక రంగం అభివృద్ధి పైనా దృష్టి సారించాలని అందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని జిల్లా యంత్రాంగం తరఫు నుంచి అందిస్తామన్నారు. జిల్లాలో అటవీ ప్రాంత విస్తీర్ణం, నగరవనాల అభివృద్ధి, రోడ్లు, మొబైల్ టవర్ల నిర్మాణాలు తదితర ప్రాజెక్టులకు అటవీశాఖ అనుమతులు, కోస్తా తీరం వెంట గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అభివృద్ధి, రెవెన్యూ రికార్డుల్లో రిజర్వ్ ఫారెస్ట్ భూముల వివరాల అప్‌డేషన్, మ్యుటేషన్, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్, అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, పర్యాటక అభివృద్ధి, స్థానికులకు జీవనోపాధి కల్పించేందుకు తీసుకుంటున్న చర్యల గురించి సంబంధిత అధికారులు కలెక్టర్‌కు వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి అటవీ శాఖల వివిధ విభాగాల నుంచి ఒకరిని ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పారు. దీంతోపాటుగా ప్రతినెలా అటవీ భూముల పరిరక్షణకు అవసరమైన సంయుక్త సమావేశం, భూముల జాయింట్ సర్వే జరిగేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. జిల్లాలో రెండు విమానాశ్రయాలు రానున్నాయని, వచ్చే ఏడాది ఆగస్టు నాటికి వెలుగొండ ద్వారా నీళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన అని కలెక్టర్ చెప్పారు. ఇవి అందుబాటులోకి వస్తే ప్రకాశం జిల్లా ముఖచిత్రమే మారిపోతుందన్నారు. హైదరాబాద్, అమరావతి, తిరుపతి, బెంగళూరుకు మధ్యలో ఉన్న ప్రాంతం కావడం, నల్లమల పరిధిలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉండడం వల్ల భవిష్యత్తులో మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి వినోద్ కుమార్, డీఎఫ్‌వో(సోషల్ ఫారెస్ట్) రాజశేఖర్ రావు, గిద్దలూరు టైగర్ రిజర్వ్ డీడీ నిషాకుమారి, మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ షేక్ మహమ్మద్ అబ్దుల్ రవూఫ్, జిల్లా ఇన్‌చార్జి పర్యాటక అధికారి రమ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పర్యాటకాభివృద్ధి పైనా దృష్టి సారించాలి
అటవీ, పర్యాటక శాఖలపై సమీక్షలో కలెక్టర్ రాజాబాబు