
ఒక్క పనిముట్టు.. అందితే ఒట్టు!
మార్కాపురం:
కూటమి ప్రభుత్వ తీరు వ్యవసాయ రంగాన్ని క్రమంగా సంక్షభంలోకి నెడుతోంది. పంటలకు గిట్టుబాటు కల్పించడంలో, ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో ఘోరంగా విఫలమైన కూటమి ప్రభుత్వ పాలకులు.. అన్నదాతలకు అవసరమైన వ్యవసాయ పనిముట్లు సకాలంలో అందించకుండా చోద్యం చూస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ ప్రారంభమైనప్పటికీ వ్యవసాయ పనిముట్లు అందకపోవడంతో రైతులు అద్దెకు తెచ్చుకుని వాడుకోవాల్సిన దుస్థితి. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలో ఖరీఫ్‌లో 70 వేల హెక్టార్లలో రైతులు వరి, మొక్కజొన్న, కంది, జొన్న, వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదం, పత్తి, మిర్చి సాగు చేశారు. ఈ పంటల్లో తెగుళ్లను నివారించేందుకు తైవాన్ స్ప్రేయర్లు అవసరం. దీంతోపాటు రబీ సీజన్‌లో పొలాలు సాగు చేసుకునేందుకు, దుక్కులు దున్నుకునేందుకు మెయింటైన్ కల్టివేటర్ (ట్రాక్టరుతో నడిచే గొర్రు), నూర్పిడి యంత్రాలు, భూమ్ స్ప్రేయర్ (ట్రాక్టరుతో నడిపే స్ప్రేయరు), విత్తనాలు ఎదబెట్టే గొర్రులు రైతులకు అత్యవసరం. ఇవేవీ జిల్లా వ్యాప్తంగా రైతులకు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు వస్తాయో.. రావో.. కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో వ్యవసాయ డ్రోన్లను అందుబాటులోకి తెచ్చినా అవి కొన్ని మండలాలకే పరిమితం చేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్ ప్రారంభం కావడంతో మొక్కజొన్న, శనగ సాగు చేసుకునేందుకు, విత్తనాలు ఎద పెట్టుకునేందుకు, ట్రాక్టరుతో నడిచే గొర్రు అత్యవసరం. పత్తి, మిర్చి, వరి పంటల్లో తెగుళ్ల నివారణకు తైవాన్ స్ప్రేయర్లు అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది.
పెట్టుబడి మరింత భారం
పత్తి, మిర్చి పండిస్తున్న రైతులు లక్షల రూపాయల సొమ్మును పెట్టుబడి కోసం ఖర్చు చేస్తున్నారు. ఎకరా పత్తి సాగుకు రూ.25 వేల వరకు, మిర్చి సాగుకు లక్షన్నర రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఈ నేపఽథ్యంలో పవర్ స్పేయర్లు, ఇతర యంత్ర పరికరాలకు బాడుగలు చెల్లించాలంటే ఆర్థికంగా మరింత భారం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పత్తి సుమారు 13 వేల హెక్టార్లలో, వరి 6 వేల హెక్టార్లలో, మొక్కజొన్న సుమారు 5వేల హెక్టార్లలో సాగుచేశారు. కాగా పత్తికి అక్కడక్కడా తామర పురుగు, పచ్చదోమ, మిర్చికి పై ముడత, వరికి ఆకుమచ్చ తెగులు ఆశించింది. వీటి నివారణకు మందులు పిచికారీ చేయాలంటే కశ్చితంగా తైవాన్ స్ప్రేయర్ అవసరం. సేద్యానికి అవసరమైన పనిముట్లతో తైవాన్ స్ప్రేయర్లు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన వ్యవసాయ పరికరాలు అందిస్తే రబీ సీజన్‌లో ఉపయోగకరంగా ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు.
ఖరీఫ్‌లో సాగుచేసిన పత్తి
రబీ ప్రారంభమైనా రైతులకు అందని వ్యవసాయ పరికరాలు
రోటోవేటర్లు, తైవాన్ స్ప్రేయర్ల కోసం ఎదురుచూపులు
జిల్లాలో ఖరీఫ్‌లో 70 వేల హెక్టార్లలో వివిధ రకాల పంటల సాగు
పనిముట్లకు అద్దెలు చెల్లించలేక అవస్థలు పడిన రైతులు

ఒక్క పనిముట్టు.. అందితే ఒట్టు!

ఒక్క పనిముట్టు.. అందితే ఒట్టు!

ఒక్క పనిముట్టు.. అందితే ఒట్టు!

ఒక్క పనిముట్టు.. అందితే ఒట్టు!