
ప్రధాని పర్యటనకు భద్రత కట్టుదిట్టం
పెద్దదోర్నాల: ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఈ నెల 16వ తేదీ ప్రధాని నరేంద్రమోదీ శ్రీశైలం పుణ్యక్షేత్రం పర్యటన నేపథ్యంలో చేపట్టబోయే భద్రతా ఏర్పాట్లపై సీఐ ప్రభాకర్‌రావు, ఎస్సై మహేష్‌లతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే వాహనాలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మండల కేంద్రంలోని మల్లికార్జున నగర్‌లోనే నిలిపేస్తామని తెలిపారు. దీంతో పాటు అదే రోజు ప్రధాని కర్నూలు పట్టణంలో పర్యటిస్తుండటంతో గుంటూరు, ఒంగోలు తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను కుంట, గిద్దలూరు, నంద్యాల మీదుగా దారి మళ్లించనున్నట్లు తెలిపారు. భక్తులు, యాత్రికులు తమ ప్రయాణాలను కొద్ది గంటల పాటు వాయిదా వేసుకోవాలని, వీలుంటే రద్దు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు శ్రీశైలం వెళ్లే వాహనదారులు లైసెన్స్‌లతో పాటు వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను తమ వాహనాల్లో కచ్చితంగా ఉంచుకోవాలన్నారు. లైసెన్సులు, ధ్రువీకరణ పత్రాలు లేని పక్షంలో శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. దీంతో పాటు నల్లమల అభయారణ్యంలో ప్రయాణించే యాత్రికులు తమ వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయటం తీవ్రంగా పరిగణిస్తారన్నారు. అలా ఎక్కడ పడిలే అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తే చలానాలు భారీగా ఉంటాయని హెచ్చరించారు.
శ్రీశైలం వెళ్లే యాత్రికులు, భక్తులు పోలీసుల నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. శ్రీశైలం వెళ్లే వాహనచోదకులు మద్యం తాగి వాహనాలు నడపటం నేరమని, అధికారులకు పట్టుబడితే శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు. నల్లమల అభయారణ్యంలో సుమారు 300 మంది సిబ్బందిలో భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
16వ తేదీ ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు
శ్రీశైలం వెళ్లే వాహనాలు ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో నిలిపివేత
ఉదయం 9 నుంచి 2 గంటల వరకు ప్రయాణాలు నిషేధం
కర్నూలు వెళ్లే వాహనాలు కుంట, గిద్దలూరు మీదుగా దారి మళ్లింపు