
డైవర్షన్ పాలిటిక్స్‌లో దిట్ట చంద్రబాబు
● మాజీ మంత్రి జోగి రమేష్‌ను అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారు
● వైఎస్సార్ సీపీ బీసీ గౌడ నాయకుల ఆగ్రహం
ఒంగోలు వన్‌టౌన్: నకిలీ మద్యం కేసులో అసలు దొంగలను తప్పించేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరదీయడం సిగ్గు చేటని వైఎస్సార్ సీపీ బీసీ గౌడ నాయకుడు తాతా నరశింహ గౌడ్ ధ్వజమెత్తారు. మాజీ మంత్రి జోగి రమేష్‌ను అక్రమంగా కేసులో ఇరికిస్తున్నారని మండిపడ్డారు. ఒంగోలులోని బొట్ల సుబ్బారావు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నారా వారి నకిలీ మద్యం కూటమి ప్రభుత్వంలో ఏరులై పారుతోందని ఎద్దేవా చేశారు. నకిలీ మద్యం విక్రయించి ప్రజా ధనం దోచుకుంటూ అడ్డంగా దొరికిన టీడీపీ నాయకుడు జయచంద్రారెడ్డి, జనార్దన్రావు, సురేంద్రనాయుడు సహా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసుతో లింకులు ఉన్న టీడీపీ ముఠాను తప్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కాగా స్కెచ్ వేశారని, గౌడ సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్‌పై అక్రమ కేసు నమోదు అందులో భాగమేనని ఆరోపించారు. ఈ కుట్రలో అసలు సూత్రదారులు చంద్రబాబు, లోకేష్ కాగా, పాత్రధారులు జయచంద్రారెడ్డి, జనార్థన్ అని చెప్పారు. ప్రజల ప్రాణాలను బలిగొంటున్న నకిలీ మద్యం మకిలిని వైఎస్సార్ సీపీ అంటించాలని సాగిస్తున్న కుట్రలు భగ్నం కాక తప్పదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కల్లుగీత కార్మికులు, గౌడ సంఘీయులను సంఘటితం చేసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం గత 17 నెలలుగా ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తోందన్నారు. గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుడితే.. కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు నిర్ణయించడం బడుగుబలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం చేసేందుకేనని విమర్శించారు. ఒక పక్క మట్టి, ఇసుక, లిక్కర్ సిండికేట్లతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న కూటమి ముఠాలు.. అది చాలదన్నట్లు నకిలీ మద్యంతో రూ.వేల కోట్లు పోగేసుకున్నాయని ధ్వజమెత్తారు. నకిలీ మద్యం కేసును తప్పుదారి పట్టించేందుకు జోగి రమేష్‌పై అక్రమ కేసులు బనాయించడం అవివేకమన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబు దిట్ట అని మండిపడ్డారు. నకిలీ మద్యంతో పేద ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న కూటమి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, తక్షణమే జోగి రమేష్ గౌడ్ మీద అక్రమ కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు తాతా నాంచార్లు గౌడ్, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫణిదపు సుధాకర్, కొత్తపట్నం మండలం బీసీ సెల్ అధ్యక్షుడు తుళ్లూరి వెంకట నారాయణ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు 38వ డివిజన్ పాలడుగు శ్రీనివాసరావు, 15వ డివిజన్ నాయకుడు వీసం బాలకష్ణ, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.