
ఆగి ఉన్న కూలీల ఆటోను ఢీకొన్న కారు
● ఆటో డ్రైవర్‌తో పాటు ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలు
పెద్దదోర్నాల: కూలీలను ఎక్కించుకునేందుకు రోడ్డుపై ఆగి ఉన్న ఆటోను వేగంగా వస్తున్న ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ సంఘటన బుధవారం మండల పరిధిలోని యడవల్లి తిరమలనాథ స్వామి కొండ వద్ద చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఆటో డ్రైవర్ ఒడిచర్ల కృష్ణారెడ్డితో పాటు ఆటోలో ఎక్కుతున్న చిట్యాల సరస్వతి, అల్లు నారాయణమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనకు సంబంధించి స్థానికుల కథనం మేరకు ఐనముక్కలకు చెందిన వ్యవసాయ కూలీలు కొందరు యడవల్లి వద్ద జరుగుతున్న వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో పనుల్లో పాల్గొన్న వ్యవసాయ కూలీలను తీసుకొచ్చేందుకు ఐనముక్కలకు చెందిన ఓ ఆటో యడవల్లి వద్ద ఉన్న తిరుమలనాథ స్వామి ఆలయం వద్ద రోడ్డుపై ఆగింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ కృష్ణారెడ్డితో పాటు మరి కొందరు వ్యవసాయ కూలీలు ఆటోలో ఎక్కే సమయంలో వేగంగా వస్తున్న కర్నాటకకు చెందిన ఇన్నోవా కారు ఢీకొనటంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిట్యాల సరస్వతి, ఒడిచర్ల కృష్ణారెడ్డిలను మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు రెఫర్ చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై మహేష్ సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఆగి ఉన్న కూలీల ఆటోను ఢీకొన్న కారు

ఆగి ఉన్న కూలీల ఆటోను ఢీకొన్న కారు