
మార్కాపురం సబ్ కలెక్టర్ బదిలీ
మార్కాపురం: మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్ బదిలీ అయ్యారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో భాగంగా ఆయనను గృహ నిర్మాణశాఖ డిప్యూటీ సెక్రటరీగా బదిలీ చేశారు. ఆ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్‌కుమార్‌మీనా ఉత్తర్వులు జారీ చేశారు.
ఒంగోలు వన్‌టౌన్: ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఒంగోలు రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుంచి 31 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు అర్హులన్నారు. అభ్యర్థులు ఆధార్, రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు, అభ్యర్థులు తమ పేర్ల నమోదుకు 83099 15577 నంబర్‌నుగానీ, ఒంగోలులోని భాగ్యనగర్ 4వ లైన్ 11వ అడ్డరోడ్డులో ఉన్న రూడ్‌సెట్ సంస్థ కార్యాలయంలోగానీ సంప్రదించాలని సూచించారు.
ఒంగోలు వన్‌టౌన్: జీఎస్టీపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని జేసీ గోపాలకృష్ణ సూచించారు. స్థానిక ప్రకాశం భవన్ వద్ద నుంచి గురువారం ఏర్పాటు చేసిన జీఎస్టీ 2.0 ర్యాలీని జేసీ ప్రారంభించారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నెల్లూరు బస్టాండ్ మీదుగా మినీ ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణలు తీసుకురావడంతో మెడిసిన్స్, మొదలు అనేక వస్తువులపై జీఎస్టీ తగ్గిందని తెలిపారు. కొన్నింటిని జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించినట్లు చెప్పారు. వాటన్నింటిపై అవగాహన ఉండాలని సూచించారు. డ్రగ్ కంట్రోలర్ పీఎస్ జ్యోతి, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పి.శ్రీరామమూర్తి, ఒంగోలు రిటైల్ షాప్ అధ్యక్షుడు జి.వెంకటరెడ్డి, వి.వెంకటరావు, వైద్యారోగ్యశాఖ తరఫున డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఎం.శ్రీనివాసనాయక్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సూరిబాబు, ఆర్‌బీఏకే నోడల్ అధికారి డాక్టర్ భగీరథి, జిల్లా మీడియా అధికారి బెల్లం నరసింహరావు, నర్సింగ్ విద్యార్థులు, అధ్యాపకులు, పట్టణ ఆరోగ్య కేంద్రాల ఆరోగ్య కార్యకర్తలు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.
మార్కాపురం టౌన్: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో హెచ్‌ఎం కొట్టడంతో విద్యార్థినికి ఫిట్స్ వచ్చి ఆస్పత్రి పాలైంది. బుధవారం జరిగిన ఈ సంఘటన గురువారం పాఠశాల తనిఖీకి వెళ్లిన సబ్ కలెక్టర్ త్రివినాగ్‌కు బాధిత విద్యార్థిని తల్లి ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న కీర్తన అనే విద్యార్థిని తరచూ పాఠశాలకు లేటుగా వస్తుందన్న కారణంతో బుధవారం హెచ్‌ఎం శ్రీదేవి కొట్టడంతో ఫిట్స్‌కు గురవగా, వెంటనే సమీపంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. ఇంటికి వెళ్లిన తర్వాత విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లి దేవి గురువారం ఉదయం పాఠశాల తనిఖీ నిమిత్తం సబ్ కలెక్టర్ త్రివినాగ్ వస్తున్నాడని తెలుసుకుని హెచ్‌ఎం శ్రీదేవిపై ఆయనకు ఫిర్యాదు చేసింది. స్పందించిన సబ్ కలెక్టర్.. పాఠశాల హెచ్‌ఎంపై విచారణ చేసి నివేదిక పంపాలని ఎంఈఓను ఆదేశించారు. పాఠశాలకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆలస్యంగా రావడంపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రేయర్ సమయానికల్లా హాజరుకావాలని ఆదేశించారు. హాస్టల్ విద్యార్థులు ఉదయం 8.45 గంటల్లోగా పాఠశాలకు చేరుకునేలా వార్డెన్లకు సమాచారం పంపాలని హెచ్‌ఎంలకు సూచించారు. లేకుంటే వార్డెన్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ హెచ్చరించారు.