
బెల్టు, కల్తీ మద్యంపై ఆందోళన చేస్తాం
ప్రభుత్వం కళ్లు తెరుచుకుని కల్తీ మద్యాన్ని నివారించాలి బెల్టు దుకాణాలు లేకుండా చేయాలి పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో 17 మెడికల్ కళాశాలలు ప్రారంభించాం వాటి ప్రైవేటీకరణను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి
ఒంగోలు సిటీ: ప్రజల పక్షాన నిలబడి బెల్టుషాపులు, కల్తీ మద్యంపై ఆందోళన చేస్తామని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం ఒంగోలు వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యంకి ఆస్కారం లేకుండా ప్రభుత్వమే మద్యాన్ని విక్రయించిందన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పాలసీ మార్చేసిందన్నారు. ప్రస్తుతం ప్రైవేటు మద్యం దుకాణాలన్నీ కూటమి నేతల కనుసన్నల్లోనే నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు. బెల్టు షాపుల ద్వారా కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయన్నారు. వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నామని, రకరకాల అంశాలు ప్రచారంలో ఉన్నాయని అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లుతెరిచి కల్తీ మద్యాన్ని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెల్టుషాపులు మూసివేస్తే కల్తీ మద్యానికి ఆస్కారం ఉండదన్నారు.
లిక్కర్ స్కాం పేరుతో అక్రమ అరెస్టులు...
ఏమీ లేని దానికి తమ ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందంటూ అక్రమ అరెస్టులు చేస్తూ భూతద్ధంలో చూపిస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. పేదలకు నాణ్యమైన వైద్యం, విద్య అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కళాశాలలు ప్రారంభించామన్నారు. లక్షలు వెచ్చించి ఖరీదైన వైద్యాన్ని పేదలు చేయించుకోలేక ప్రాణాలు పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో మెడికల్ కళాశాలలు ప్రారంభించామన్నారు. వాటికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వస్తుందని, ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందన్న గొప్ప ఆలోచనతో వాటిని ప్రారంభించామని అన్నారు. వాటిని పూర్తి చేస్తే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న కుట్రతో కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తెస్తోందన్నారు. ప్రైవేటీకరణను ప్రజలు సైతం వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రైవేటీకరణతో కలిగే నష్టాలను ప్రజలకు వివరించేందుకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో నర్సీపట్నంలో నిర్మాణం మొదలుపెట్టిన కళాశాల వద్దకు ఆయన వెళ్తున్నారన్నారు. ఒక్కరోజులో అన్ని భవనాల నిర్మాణాలు పూర్తికావని, నర్సీపట్నంలో ఏమీలేదన్న స్పీకర్ ప్రకటనపై వాస్తవాలు చూపించేందుకు తమ పార్టీ అధినేత వెళ్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై పాలకులను నిలదీసే హక్కు ఎవరికై నా ఉంటుందన్నారు. ట్రాఫిక్ నియంత్రణ చేయలేమని చెప్పడం సరికాదని, జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తికి ఆ స్థాయిలో రక్షణ కల్పిస్తే ఎలాంటి సంఘటనలు జరిగేందుకు ఆస్కారం ఉండదని వైవీ అన్నారు. ప్రభుత్వ ఆధీనంలో మెడికల్ కళాశాలలు, వైద్యశాలలు ఉంటే మెరుగైన వైద్యం అందుతుందా..లేదా..? అన్నది ప్రజలు కూడా గమనించాలన్నారు. డీఎస్సీ పారదర్శకంగా జరగలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. దానిపై విచారణ జరిపించి అర్హులైన వారికి అవకాశం కల్పించాలన్నారు. వైవీ సుబ్బారెడ్డి వెంట వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు, రాష్ట్ర పార్లమెంట్ కార్యదర్శులు కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, తదితరులు పాల్గొన్నారు.