
మెడికల్ కళాశాలల ప్రైవేట్‌పరం దుర్మార్గం
● వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్
పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి
ఒంగోలు సిటీ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలని చూడటం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గ్రామ/వార్డు రచ్చబండ ద్వారా సంతకాలు సేకరిస్తామన్నారు. కొండపి నియోజకవర్గంలోని పాకల గ్రామంలో 10వ తేదీ ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. అదే రోజు సాయంత్రం ఒంగోలులో సంతకాల సేకరణ చేస్తామన్నారు. అక్టోబర్ 28న ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రదర్శన ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం నవంబర్ 12న జిల్లా కేంద్రంలో ప్రదర్శన ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. నవంబర్ 23న నియోజకవర్గాల కేంద్రాల నుంచి సంతకాలు చేసిన వినతిపత్రాలు జిల్లా కేంద్రాలకు వచ్చే కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు లేదా ఇన్‌చార్జిలు జెండా ఊపి ప్రారంభించాలని తెలిపారు. నవంబర్ 24న సంతకాలు చేసిన వినతిపత్రాలను జిల్లా కేంద్రం నుంచి కేంద్ర కార్యాలయానికి చేర్చే కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడు జెండా ఊపి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ జాబితాలను గవర్నర్ అపాయింట్‌మెంట్ బట్టి పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌కు అందజేసే కార్యక్రమం ఉంటుందని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో ప్రవేశపెట్టిన 104, 108 వాహనాలను కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోందన్నారు. కూటమి ప్రభుత్వంలో సామాన్యుడికి వైద్యం అందే పరిస్థితి కనిపించడం లేదని మండిపడ్డారు.
పేదలకు వైద్యం అందుబాటులోకి
తీసుకురావాలన్నదే లక్ష్యం..
పేదలకు వైద్యం అందుబాటులోకి రావాలన్న లక్ష్యంతోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారన్నారు. అందులో 7 మెడికల్ కళాశాలలు నిర్మాణాలు పూర్తికాగా, 10 కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కానీ టీడీపీ నాయకులు నిత్యం అబద్ధాలు వల్లె వేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇంతటి దుర్మార్గమైన ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. కనీసం ఓట్లు వేసిన ప్రజల కోసమైనా టీడీపీ నాయకులు నిజాలు మాట్లాడాలన్నారు. ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. అందుకే కోటి సంతకాలను సేకరిస్తున్నామన్నారు. మెడికల్ కళాశాలలు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్‌పరం కానివ్వకుండా వైఎస్సార్ సీపీ పోరాడుతుందని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ పార్లమెంట్ కార్యదర్శి కసుకుర్తి ఆదెన్న, రాష్ట్ర పార్లమెంట్ కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, జాయింట్ సెక్రటరీ బొగ్గుల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.