
పల్లె జనానికి అనంత కష్టాలు
అనంతపురం సభకు జిల్లా బస్సులు జిల్లాలో 452 బస్సులు ఉండగా160 బస్సులు తరలింపు అనధికారికంగా 300కుపైగా బస్సులు పంపిన వైనం నానా అగచాట్లు పడిన ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులతో మహిళా ప్రయాణికుల ఇబ్బందులు జిల్లాలోని 5 ఆర్టీసీ డిపోలపై రూ.5 కోట్లకు పైగా భారం
ఒంగోలు టౌన్/మార్కాపురం: కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ సూపర్ సక్సస్ సభ పల్లెజనానికి కష్టాలు తెచ్చిపెట్టింది. ఒకవైపు ఎండవేడి, మరో వైపు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించి అవస్థలు పడ్డారు. ప్రధానమైన రూట్లలో బస్సుల సంఖ్య తగ్గడంతో ప్రతిరోజూ వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారి ఓపికను అధికారులు పరీక్షించారు. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో సభ జరుగుతుంటే ఇక్కడ నుంచి బస్సులను తరలించడమేమిటని ప్రయాణికులు మండిపడుతుతున్నారు. ప్రజల సొమ్ముతో సొంత కూటమి సభలు పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు పడిన అవస్థలు వర్ణనాతీతం. రెండు రోజుల నుంచి బస్సు సర్వీసులు తగ్గించడంతో ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది. పశ్చిమ ప్రకాశం మార్కాపురం, గిద్దలూరు నుంచి నంద్యాల, కడప, కంభం, రాచర్ల, కొమరోలు, ఒంగోలు తదితర ప్రాంతాలకు ఎక్కువ మంది వెళ్తుంటారు. మార్కాపురం, గిద్దలూరు, పొదిలి డిపోల నుంచి 101 సర్వీసులను అనంతపురం సభకు పంపారు. దీంతో రెండు రోజులుగా పశ్చిమ వాసులు పడరాని అగచాట్లు పడ్డారు. ఒంగోలు ఆర్టీసీ డిపోలో మొత్తం 74 పల్లె వెలుగు బస్సులున్నాయి. అందులో 52 ఆర్టీసీ బస్సులు కాగా మిగిలిన 22 బస్సులు అద్దె బస్సులు. ఈ 52 బస్సుల్లో 38 బస్సులను అనంతపురంలో జరిగిన సభకు తరలించారు. మిలిగిన 14 బస్సులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
రాప్తాడు, సింగనమలకు జిల్లా బస్సులు:
అనంతపురం సభకు జిల్లాలోని ఒంగోలు, పొదిలి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ఆర్టీసీ డిపోల నుంచి బస్సులను పంపించారు. ఈ ఐదు ఆర్టీసీ డిపోల్లో మొత్తం 452 బస్సులు ఉన్నాయి. ఇందులో 315 బస్సులను సీ్త్ర శక్తికి కేటాయించారు. ఈ మొత్తంలో సుమారు 160కు పైగా బస్సులను అనంతపురం సభకు తరలించామని అధికార వర్గాలు చెబుతుండగా 300పైగా బస్సులు వెళ్లాయని ఆర్టీసీ వర్గాలే గుసగుసలాడుతున్నాయి. ఈ బస్సులకు అనంతపురం జిల్లా రాప్తాడు, సింగనమల మండలాలు కేటాయించారు. మంగళవారం జిల్లా నుంచి బయలు దేరిన బస్సులు రాత్రికి ఆయా మండలాల్లో కేటాయించిన గ్రామాలకు చేరుకుని బుధవారం ఉదయం ఆయా గ్రామాల నుంచి సమీకరించిన జనాలను అనంతపురంలోని సభావేదిక వద్దకు చేర్చాయి. సభ అయిన తరువాత తిరిగి వారిని స్వస్థలాలకు చేర్చాలని అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.
జిల్లాపై రూ.5 కోట్ల భారం:
అనంతపురం సభకు జిల్లాలోని ఆర్టీసీ బస్సులన్నిటినీ తరలించాల్సి రావడంతో ఆర్టీసీకి భారీగా కన్నం పడినట్లుంది. సహజంగా అయితే సీటింగ్ ప్రకారం రానుపోను లెక్కేసి అద్దె చెల్లిస్తారు. ఒక్కో పల్లెవెలుగు బస్సుకు రోజుకు రూ.55 వేల ఖర్చు వస్తుంది. ఈ లెక్కన ఒక్క ఒంగోలు డిపోకు సుమారు కోటి రూపాయల వరకు నష్టం వస్తుందని యూనియన్ నాయకులు లెక్కలేస్తున్నారు. జిల్లాలోని 5 డిపోలకు కలుపుకొని రూ.5 కోట్ల ప్రజల సొమ్ము కూటమి పాలైనట్లేనని చెబుతున్నారు. ప్రభుత్వం పేరుతో కూటమి పాలకులు కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును వృథా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

పల్లె జనానికి అనంత కష్టాలు

పల్లె జనానికి అనంత కష్టాలు