
తన పొలంలో ఆవేదన వ్యక్తం చేస్తున్న ధనమ్మ
మహిళల్ని బెదిరించి పొలం దున్నేసిన వైనం
తానం చింతల గ్రామంలో కూటమి నేతల అండతో దౌర్జన్యం
తమ పొలం ఆక్రమిస్తున్నారని విలపించిన మహిళలు
దర్శి: తమ పొలాన్ని ఆక్రమించుకునేందుకు పత్తిపైరును దున్నేశారని, అడ్డం వస్తే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తామని, దిక్కున్నచోట చెప్పుకోండని బెదిరించారని ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని తానం చింతల గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు విలపించారు. కూటమి నేతల అండతో దౌర్జన్యం చేస్తున్నారని శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు యన్నాబత్తిన యలమంద భార్య ధనమ్మ, మేకల గురవారావు భార్య మేకల లక్ష్మీదేవి తెలిపారు. వారి కథనం మేరకు.. సర్వే నంబరు 132/2లో యన్నాబత్తిన ధనమ్మకు 79 సెంట్లు, సర్వే నంబరు 225/2 లో మేకల గురవారావుకు 1.32 ఎకరాల భూమి ఉంది.
దశాబ్దాలుగా వారు ఈ భూమిని సాగుచేసుకుంటున్నారు. ప్రస్తుతం పత్తిపంట వేశారు. గ్రామానికి చెందిన మేకల రుక్మిణీదేవి, ఆమె కుమారుడు ప్రసన్నకుమార్ కోతదశకు చేరిన ఆ పైరును శుక్రవారం దున్నేశారు. గ్రామంలోని కూటమి నాయకుల ద్వారా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మితో అధికారులకు ఫోన్ చేయించి, పొలాలను దున్నేసి ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. ఇదేమని అడిగితే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తామని బెదిరించారు.
గ్రామంలో రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని తమ పంటలు చెడగొట్టి తమ నోటికాడ కూడు లాగేశారని, రూ.50 వేల విలువైన పంటను నాశనం చేశారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై గతంలో తమను పిలిపించి మాట్లాడిన సీఐ, ఎస్‌ఐ, తహశీల్దార్.. తమవైపు న్యాయం ఉండటంతో మౌనంగా ఉన్నారని చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఆక్రమణకు యతి్నంచి పైరును దున్నటంపై ఫిర్యాదు చేశామని, పోలీసులు న్యాయం చేస్తారని ఆశగా చూస్తున్నామని వారు తెలిపారు.