‘ఉపాధి’ చట్టాన్ని దెబ్బతీయొద్దు
ఒంగోలు టౌన్: గ్రామీణ నిరుపేద ప్రజల జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఉపేక్షించేది లేదని, ప్రజలను ఏకం చేయడం ద్వారా పోరాటాలను ఉధృతంగా నిర్వహిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ హెచ్చరించారు. శుక్రవారం స్థానిక మల్లయ్యలింగం భవనంలో వామపక్ష పార్టీల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం మార్పుపై మోదీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 22వ తేదీన ఽనిరసన కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. వామపక్ష పార్టీల ఒత్తిడి మేరకు యూపీఏ–1 పాలనలో ప్రారంభించిన ఉపాధి హామీ చట్టం వల్ల గ్రామీణ ప్రజలకు వంద రోజుల పని దొరకడంతో కొంతమేర మెరుగైన జీవితం అనుభవిస్తున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో వలసలు తగ్గాయని, ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని చెప్పారు. ఆర్థికంగా కొంత వెసులుబాటు లభించడంతో పిల్లలను చదివించుకుంటున్నారని, కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు మొదలుపెట్టారని ఆరోపించారు. ప్రజల వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని వెనక్కి తగ్గిన మోదీ ఇప్పుడు దొడ్డిదారిన పేరు మార్పు వంకతో పథకంలో అనేక మార్పులు తీసుకువడం అభ్యంతరకరమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు మాట్లాడుతూ.. పార్లమెంటులో ప్రతిపక్షాల వాదనలు వినకుండా ఏకపక్షంగా సవరించిన ఉపాధి హామీ బిల్లును ఆమెదిండం దారుణమన్నారు. జీరామ్‌జీ పథకం పేరుతో ఉపాధి హామీని నిర్వీర్యం చేసి పేదల పొట్ట కొట్టడం భావ్యం కాదన్నారు. గతంలో కేవలం 10 శాతం నిధులు కేటాయించడానికే వెనకంజ వేసిన రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఏకంగా 40 శాతం నిధులు కేటాయించడం సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించారు. ఉపాధి హామి పథకాన్ని నిలిపివేసే కుట్రలో భాగంగానే మార్పులు చేశారని ఆరోపించారు. సీపీఐఎంఎల్ న్యూ డెమెక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్, జిల్లా నాయకులు ఎంఎస్ సాయి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ పేరు కనపడకుండా, వినపడకుండా చేయడానికి మోదీ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందన్నారు. దేవుళ్ల పేరుతో పథకాన్ని తీసుకొస్తే ఎవరూ విమర్శించరనే ఉద్దేశంతో రాముడి పేరుతో ఉపాధి హామీ పథకంలో మార్పులు తీసుకొచ్చారన్నారు. ప్రజలకు తిండిపెట్టే ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి దేవుడి పేరును అడ్డం పెట్టుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ నెల 22న నిరసన కార్యక్రమంలో రైతులు, నిరుపేదలు, వ్యవసాయ కూలీలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆర్.వెంకటరావు, శ్రీరాం శ్రీనివాసరావు, కొత్తకోట వెంకటేశ్వర్లు, బి.రఘురాం, నల్లూరి మురళి తదితరులు పాల్గొన్నారు.
వామపక్ష నేతల హెచ్చరిక


