రబీ సీజన్‌కు సరిపడా యూరియా
ఒంగోలు సబర్బన్: జిల్లాలోని రైతులకు రబీ సీజన్‌లో అన్ని పంటలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ జేడీ ఎస్.శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లాలో యూరియా లభ్యత వివరాలు వెల్లడించారు. జిల్లాలో ఈ ఏడాది అక్బోబర్ ఒకటో తేదీ నాటికి 4,824 టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. 2025 అక్బోబర్ 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు జిల్లాకు మొత్తం 23,115 టన్నుల యూరియా అవసరం కాగా, మొత్తం 30,711 టన్నుల యురియాను రైతులకు అందుబాటులో ఉంచామని, ఈ నెలాఖరుకు 500 టన్నుల యూరియా జిల్లాకు రానుందని వివరించారు. నానో యూరియా, నానో డీఏపీ సైతం అందుబాటులో ఉందని వెల్లడించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.
మద్దిపాడు: ఐటీసీ గోడౌన్‌లో 20 అడుగుల ఎత్తు నుంచి ప్రమాదవశాత్తు జారిపడిన వ్యక్తి మృతిచెందిన ఘటనపై మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు మండలంలోని గార్లపాడు గ్రామంలోని ఐటీసీ గోడౌన్‌లో త్రిపుర రాష్ట్రం థలై జిల్లాకు చెందిన ఇంతాస్ ఖాన్ (20) గురువారం ఉదయం 20 అడుగుల ఎత్తులో లైటింగ్ షీట్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఆ షీట్ విరిగిపోవడంతో జారి కిందపడి తలకు తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయాడు. అతడిని ఒంగోలులోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుని తండ్రి మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశాడు. ఆమేరకు ఎస్‌ఐ వెంకట సూర్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని ఓ బంగారం దుకాణంలో ఆభరణాలు చోరీచేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం కనమాకులపల్లి గ్రామానికి చెందిన గీత ఈనెల 17వ తేదీన మార్కాపురంలోని చెన్నకేశవస్వామి గుడి బజారులో ఓ బంగారం షాపులో ఆభరణాలు కొనుగోలు చేసేందుకు వెళ్లి మూడు జతల వెండి పట్టీలను చోరీ చేసింది. దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు గీతను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై సైదుబాబు తెలిపారు.


