
అడ్డగోలుగా తవ్వేస్తూ...అక్రమంగా దోచేస్తూ..
బల్లిపల్లి చెరువుల్లో మట్టి తవ్వకాలు
బాల వెంకటాపురం చెరువులో మట్టి తవ్వకాలు
కనిగిరిరూరల్:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కాదేది దోపిడి అనర్హం అన్నట్లు మారింది. ఇసుక, రేషన్, మట్టి ఇలా ఒకటేమి అన్ని రకాలుగా సంపద సృష్టి పేరుఅధికార దోపిడీకి పాల్పడుతున్నారు. అరికట్టాల్సిన అధికార యంత్రంగా మాముళ్ల మత్తులో జోగడం.. నిబంధనల సాకుతో అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ పగటి నిద్ర పాటిస్తూ మౌనం దాల్చుతున్నారనే విమర్శలున్నాయి.
యథేచ్ఛగా మట్టి దోపిడీ..
కనిగిరి నియోజకవర్గంలోని కనిగిరి, సీఎస్‌పురం, పామూరు మండలాల్లోని శివారు ప్రాంతాల్లో అక్రమ మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ప్రధానంగా కనిగిరి మండలంలో జోరుగా చెరువుల్లో మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. అధికార పార్టీ నేతల అండతో అక్రమార్కులు చెరువుల్లో, కుంటల్లోని మన్నును జేసీబీలు, పొక్లెయిన్లతో దండిగా దున్నుకుంటున్నారు. ప్రధానంగా కనిగిరి పట్టణంలోని నాగులచెరువును కాంట్రాక్టర్ అవతారమెత్తిన ఓ ద్వితీయ శ్రేణి అధికార పార్టీ రూరల్ నాయకుడు, మరో ఇద్దరు ద్వితీయ శ్రేణి నాయకులు, కనిగిరి పెద్ద చెరువులో రియల్ వ్యాపారంలో పేరు మోసిన ద్వితీయ శ్రేణి అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. రాత్రి వేళ గుట్టుగా మట్టిని దోచుకుంటున్నారు. యంత్రాలతో మట్టిని తవ్వుకుంటూ అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రాక్టర్లు, టిప్పర్లతో ప్లాటలకు, రోడ్లకు, రియల్ స్థలాలకు మట్టిని తోలుకుంటూ తెల్ల వారిసరికి చెరువు మట్టిపై గ్రానైట్ క్వారీల గ్రావెల్ తోలించి లెవల్ చేస్తున్నారు. ఇటీవల పట్టణ పరిసర ప్రాంతాల్లో జరిగిన పెద్ద రోడ్లకు ఎటువంటి అనుమతులు లేకుండా, నామ్‌కే వాస్తే అనుమతులతో కొందరు నాగుల చెరువుమట్టిని తరలించారు. పునుగోడు, చిన ఇర్లపాడు, వాగుపల్లి, నాగులచెరువులోని మట్టిని కందుకూరు రోడ్డులోని సుమారు 50 ఎకరాల రియల్ భూములకు తరలించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
అలాగే కనిగిరి పెద్ద చెరువులోని మట్టిన అధికార పార్టీ నేతలు నామ్‌కే వాస్తే చలానా చెల్లించి అర్ధరాత్రి దాటిన తర్వాత అధికార అండతో ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు చేసినట్లు తెలిసింది. వారం రోజుల్లో చెరువు సమీపంలో, అలుగు వాగు సమీపంలో వెలిసిన రియల్ భూములకు మట్టిని తోలి రాత్రికి రాత్రే చదును చేస్తుకున్నట్లు తెలిసింది. దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేసినా.. ప్రశ్నించినా.. కనిగిరిలో జరుగుతున్న రైల్వే, గ్రీన్ ఫీల్డ్ హైవే పనులకు మట్టి తరిస్తున్నారని చూసి, విచారించి చర్యలు తీసుకుంటామంటూ సమాధానం చెబుతూ అధికారులు జారుకుంటున్నారు. ఈ అక్రమ తంతు ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ అధికారులకు తెలిసినా మామూళ్ల మత్తులో ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. సీఎస్‌పురం మండలంలో కనిగిరి రోడ్డులో కొండను ఆనుకుని ఉన్న ప్రాంతంలో మట్టి తవ్వకాలను హైవే రోడ్డు పనుల పేరితో జోరుగా తవ్వకాలు చేస్తున్నారు. అలాగే సీఎస్‌పురం చెరువులోని మట్టిని కూడా తవ్వారు. ఇటీవల వర్షానికి చెరువులో నీరు చేరడంతో తవ్వకాలు ఆపారు. ఏవరైన పేదవాడు ఇళ్లు కట్టుకునేందుకు నాల్గు ట్రాక్టర్లు మట్టి చెరువుల్లో నుంచి తొలుకుంటుంటే.. ఆఘ మేఘాలపై వాలి హడావుడి చేసే పెనాల్టీలు, వాహనాలు సీజ్‌లు చేసే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అభివృద్ధి పనుల మాటున జరుగుతున్న మట్టి దోపిడిపై ఎందుకు నిఘా పెట్టడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వారికి సమాచారం లేకుండానే..
అభివృద్ధి పనులకు మట్టి తవ్వకాలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఆ చెరువు పరిధిలో సర్పంచులు, నీటి సంఘం అధ్యక్షులకు కనీస సమాచారం ఇవ్వడం లేదు. మట్టి తవ్వకాలపై ప్రశ్నిస్తే తమపై కక్ష్య సాధింపులు జరుగుతాయన్న భయంతో సర్పంచ్‌లు, తమ పార్టీ వారే తవ్వుకుంటుంటే తామెలా ప్రశ్నించాలనే భావనతో నీటి సంఘ అధ్యక్షులు మౌనం దాల్చుతున్నారు.
దీపం ఉండగానే చక్క బెట్టుకోవాలన్న చందంగా అధికారాన్ని అడ్డుపెట్టుకోని టీడీపీ నేతలు ప్రకృతి వనరులను దోచేస్తున్నారు. ఏం చేసినా ఎవరేం చేస్తారులే అన్న రీతిలో బరితెగించి బహిరంగంగా మట్టిని దోచేస్తున్నారు. రేయింబవళ్లు తేడా లేకుండా సాగుతున్న ఈ మట్టి దోపీడీలో నెలకు లక్షల్లో చేతులు మారుతున్నాయి. అధికారులకు ఇవన్నీ తెలిసినా ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
కనిగిరిలో యథేచ్ఛగా మట్టి దోపిడీ..
చెరువులను తోడేస్తున్న మట్టి మాఫియా..
అభివృద్ధి పనుల మాటున అక్రమాలు
పట్టించుకోని అధికారులు
లక్షలు సంపాదిస్తున్న అక్రమార్కులు
అభివృద్ధి మాటున..అక్రమంగా తోడేస్తూ
ప్రధానంగా కనిగిరి పట్టణ, మండల ప్రాంతాల్లో జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే.. నేషనల్ హైవే రోడ్డు పనులు, నడికుడి కాళహస్తి రైల్వే అభివృద్ధి పనులు అధికార పార్టీ నాయకులకు వరంగా మారాయి. అభివృద్ధి పనుల మాటున విస్తృతంగా మట్టి దోపడీకి పాల్పడుతున్నారు. మండంలోని బల్లిపల్లి, బాల వెంకటాపురం, యర్రబల్లి, తమటంవారిపల్లి వాగు, అడ్డరోడ్డు, పునుగోడు, చిన ఇర్లపాడు, యడవల్లి, దిరిశవంచ చెరువుల్లో, కుంటల్లో, సీఎస్‌పురం శివారు ప్రాంతాల్లో కుంటల్లో యంత్రాలతో జోరుగా మట్టిని తవుతున్నారు. గ్రీన్ ఫీల్డ్, నేషనల్ హైవే రోడ్డు పనులకు, రైల్వేలైన్ పనులకు ప్రభుత్వ, అధికారుల అనుమతితో తవ్వకాలు చేస్తున్నారు. ఏ చెరువులో ఎన్ని క్యూబిక్ మీటర్ల తవ్వకంకు అనుమతి ఉంది.. మట్టిని ఎవరు తవ్వుకు పోతున్నారనే దాన్ని పరిశీలన చేయాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కనీసం ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో గ్రామాల్లోని టీడీపీ నేతలకు ఇది వరంగా మారింది. ట్రాక్టర్ మట్టిని రూ.800 నుంచి రూ.1000 వరకు, ట్రిప్పర్ మట్టి రూ.3 వేల నుంచి రూ.4 వేలకు విక్రయిస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు.

అడ్డగోలుగా తవ్వేస్తూ...అక్రమంగా దోచేస్తూ..