
బంగారు కుటుంబాలకు మార్గదర్శకులవ్వాలి
● వ్యాపారుల అసోసియేషన్లతో జాయింట్ కలెక్టర్ సమావేశాలు
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన పీ–4 పథకానికి సంబంధించి బంగారు కుటుంబాలకు మార్గదర్శకులుగా నిలవాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం వివిధ వ్యాపార సంస్థలకు చెందిన అసోసియేషన్ నాయకులతో విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హోల్ సేల్ డీలర్స్ అసోసియేషన్స్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్, ఎల్పీజీ గ్యాస్ డీలర్స్ అసోసియేషన్స్, పెట్రోల్ బంకు డీలర్స్ అసోసియేషన్స్, హోటల్స్–రెస్టారెంట్స్ అసోసియేషన్స్, తూనికలు–కొలతల డీలర్స్ అసోసియేషన్స్ ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేశారు. జేసీ మాట్లాడుతూ పీ–4 పథకంలోని బంగారు కుటుంబాలకు సహాయంగా నిలబడేందుకు తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. పీ–4 పథకంపై జాయింట్ కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ పద్మశ్రీ. సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ డీఎం వరలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు.