
బతుకు భారమై..!
భరోసా కరువై
● ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల కోసం ఎదురుచూపులు ● జిల్లాలో స్పౌజ్ కోటాలో సుమారు 5 వేల మందికి పింఛన్లు మంజూరు ● మూడు నెలలుగా నిధులు ఇవ్వని ప్రభుత్వం ● పింఛన్ల కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు
కనిగిరిరూరల్:
భారమవుతున్న బతుకులకు ఆసరా కరువైంది.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం అండగా నిలవడం లేదు. కూటమి ప్రభుత్వంలో కొత్తగా పింఛన్లు అందక వృద్ధులు కన్నీళ్లు పెడుతున్నారు. వితంతువులు, దివ్యాంగులు, కన్నవారి ఆదరణ నోచుకోని వృద్ధులు, కార్మికులకు వేలాది మందికి ప్రభుత్వ భరోసా లేక పింఛన్ల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
ఒక్క పింఛన్ ఇస్తే ఒట్టు..
కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది కాలంలో కొత్త పెన్షన్ల మాట దేవుడేరుగు. కనీసం స్పౌజ్ కోటా పెన్షన్లు సైతం ఇవ్వకుండా లబ్ధిదారులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. ఫలితంగా ఆ లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు ఏం చేయలేని నిస్సహాయత. కూటమి పాలనలో కొత్త పింఛన్లకు ఇప్పటి వరకు ఎటువంటి దరఖాస్తులు స్వీకరించలేదు. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వ్లు ప్రకారం 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య చనిపోయిన వారికే (సామాజిక పింఛన్‌దారులు మరణిస్తే..) వారి భార్యలకు స్పౌజ్ కేటగిరిలో పింఛన్ మంజూరుకు అర్హులుగా నిర్ధారించారు. దీంతో పింఛన్ పొందని వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబంలో అర్హులు ఉన్నా వారికి పింఛన్ మంజూరు చేయడం లేదు. దీంతో జిల్లాలో వందలాది మంది వితంతువులు పింఛన్ పొందేందుకు అర్హత ఉన్నా..వారికి మొండిచేయి ఎదురవుతోంది.
మంజూరు చేసినా..నిధులివ్వకుండా మెలిక
జిల్లాలో సుమారు 5 వేల మందికి స్పౌజ్ కోటాలో పింఛన్లు మంజూరయ్యాయి. అయితే ప్రభుత్వం మాత్రం పైసా నిధులు ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది. దీంతో కొంత మంది అర్హులు పింఛన్ కోసం ఎదురుచూస్తూ ఇప్పటికే కాలం చెల్లారు. ప్రస్తుతం స్పౌజ్ అర్హుల్లో 25 శాతం మంది మరణించగా.. మరో 5 శాతం మంది వివిధ కారణాలతో అనర్హులుగా తేలినట్లు అధికారులు నివేదికలు పంపినట్లు సమాచారం. అందిన సమాచారం ప్రకారం జిల్లాలోని రూరల్, అర్బన్ మున్సిపాలిటీల్లో సుమారు 5 వేల మంది స్పౌజ్ కోటాలో అర్హత కల్గిన వారుగా తేలగా అందులో కేవలం 3,500 మంది మాత్రమే అర్హత కోటాలో ఇప్పటి వరకు లైవ్‌లో ఉన్నట్లు సమాచారం. సుమారు 1,000 మంది వరకు వివిధ కారణాలతో జాబితాల్లో అర్హత కోల్పోనున్నారు.
– కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 587 మంది స్పౌజ్ కోటాలో అర్హులు. కనిగిరి మున్సిపాలిటీలో 68 మంది, కనిగిరి రూరల్‌లో 105 మంది, హెచ్‌ఎంపాడులో 59 మంది, పీసీపల్లిలో 74 మంది, సీఎస్‌పురంలో 85 మంది, వెలిగండ్లలో 71 మంది, పామూరులో 110 మంది స్పౌజ్ కోటాలో అర్హతగా వితంతువులు ఉన్నా.. వారిలో 100 మంది వరకు (కాలం చెల్లినవారు, ఇతర కారణాలతో అనర్హత వేటు పడిన వారు) వివిధ కారణాలతో అర్హత జాబిత్లాల్లోకి ఎక్కలేదని తెలిసింది.
50 ఏళ్లకే పింఛన్ ఏమైందో..
కూటమి సర్కార్ కొలువు తీరిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఈ హామీపై నేటికి అతీగతి లేదు. జిల్లా వ్యాప్తంగా అనేక మంది పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అర్హతే ప్రమాణికంగా కొత్త పింఛన్లు మంజూరు చేశారు. మధ్యవర్తులు, దళారులతో పనిలేకుండా అర్హతే ప్రమాణికంగా రాజకీయాలకు, పార్టీలకు, వర్గాలకు, కులాల కతీతంగా కేవలం అర్హతను బట్టి ప్రతి ఏడాది జనవరి, జూలై నెలల్లో పింఛన్లు అందచేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ అర్హతను బట్టి అధికారులు పింఛన్లు మంజూరు చేసేవారు. నేడు ఆ పరిస్థితి లేదు.
సైట్ ఓపెన్ అయితే దరఖాస్తులు స్వీకరిస్తాం
స్పౌజ్ కోటాలో ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసింది. కానీ ఇంకా నిధులు విడుదల కాలేదు. కనిగిరి మండలానికి 105 స్పౌజ్ పింఛన్లు మంజూరయ్యాయి. గ్రాంట్ వచ్చిన తర్వాత ఎన్ని నెలలకు ఇస్తారనే తెలుస్తోంది. కొత్త పింఛన్లకు సైట్ ఓపెన్ అయితే దరకాస్తులు స్వీకరిస్తాం.
ప్రభాకర్‌శర్మ, ఎంపీడీఓ, కనిగిరి

బతుకు భారమై..!

బతుకు భారమై..!