పల్లెలు నీరసించి! | - | Sakshi
Sakshi News home page

పల్లెలు నీరసించి!

Jul 25 2025 8:09 AM | Updated on Jul 25 2025 8:09 AM

పల్లెలు నీరసించి!

పల్లెలు నీరసించి!

నిధులు మళ్లించి..
ఖాతాల్లో నిధుల్లేక పల్లెలు నీరసించాయి. అధ్వాన పారిశుధ్యం.. గుంతలు పడిన రహదారులు.. అస్తవ్యస్త మురుగు కాలువలు.. తాగునీటి వెతలు.. వెలగని వీధి దీపాలు.. ఇలా సమస్యలు కోకొల్లలు. పంచాయతీలను అద్దంలా మెరిపిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, పంచాయతీరాజ్‌ శాఖామంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. ఆరు నెలల కిందట విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.38 కోట్లను ప్రభుత్వం మళ్లించడంతో జిల్లాలో 730 గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి నిలిచిపోయింది. ప్రస్తుతం వసూలు చేస్తున్న పన్నులతోనే అరకొర అవసరాలు తీర్చుకుంటున్నామని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు, పవన్‌కళ్యాణ్‌ గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తామని, కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా గ్రామ పంచాయతీలకే నేరుగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కి గ్రామ పంచాయతీల నడ్డివిరిచే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. జిల్లాలో 730 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు 15వ ఆర్థిక సంఘం నిధులను రెండు విడతలుగా అందజేస్తున్నారు. ఈ నిధులతో రోడ్లు, కాలువలు తదితర అభివృద్ధి పనులతో పాటు పంచాయతీలలో పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం, ఇతర అవసరాలకు ఉపయోగించాల్సి ఉంటుంది. అంతేగాకుండా ఇంటి పన్ను, వ్యాపారుల నుంచి వసూలు చేసే వాణిజ్య పన్నులతో పాటు భూముల రిజిస్ట్రేషన్‌ ఫీజు, గ్రంథాలయం, మైనింగ్‌, ఇసుకపై విధించే సెస్‌లను గ్రామ పంచాయతీలకు కేటాయించాల్సి ఉంది. కానీ, కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కేటాయించాల్సిన నిధులను కూడా సక్రమంగా ఇవ్యకుండా జాప్యం చేస్తోందని, దీంతో నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.38 కోట్లు విడుదల కావాల్సి ఉంది. అయితే, వాటిని ప్రభుత్వం దారి మళ్లించింది. ఇక వివిధ రకాల పన్నుల ద్వారా వసూలవుతున్న వాటితో అరకొరగా పనులు చేపడుతున్నామని వాపోతున్నారు. ఇతర విభాగాలు రిజిస్ట్రేషన్‌ ఫీజు, గ్రంథాలయం, మైనింగ్‌, ఇసుక సెస్‌ల ద్వారా రావాల్సిన నిధులు కూడా పంచాయతీలకు దక్కడంలేదు.

మైనర్‌ పంచాయతీలకు కేంద్రం నిధులే దిక్కు..

జిల్లాలో 730 పంచాయతీలుండగా, అందులో సుమారు 38 మేజర్‌ పంచాయతీలు ఉన్నాయి. మిగిలిన 692 మైనర్‌ పంచాయతీలు. మేజర్‌ పంచాయతీల్లో ఇంటి పన్ను, నీటి పన్ను, వృత్తి పన్ను, వాణిజ్య పన్ను కింద సంవత్సరానికి పంచాయతీ సామర్థ్యాన్ని బట్టి రూ.50 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. వీటిని పారిశుధ్యం, తాగునీటి సరఫరా, బ్లీజింగ్‌, తదితర అత్యవసర పనులకు వెచ్చించాల్సి వస్తోంది. వీటికి 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా తోడైతే పంచాయతీలు ఆర్థికంగా బలోపేతమవుతాయి. సుమారు 200 పంచాయతీలు కేవలం ఆర్థిక సంఘం నిధులపైనే ఆధారపడాల్సిన దుస్థితి ఉంది. ఈ పంచాయతీల్లో అరకొరగా వసూలవుతున్న పన్నులను పంచాయతీ సిబ్బంది అవినీతికి పాల్పడి స్వాహా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నిధుల దుర్వినియోగంపై రాజకీయ దురుద్దేశంతో గ్రామ సర్పంచ్‌ చెక్‌ పవర్‌ రద్దు చేస్తారే తప్ప.. అవినీతికి కారకులైన అధికారులపై మాత్రం చర్యలు ఉండవన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

పల్లె పండుగ నిధులు వచ్చేనా.?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్భాటంగా పల్లె పండుగ కార్యక్రమం చేపట్టింది. ఇందుకు జిల్లాకు రూ.140 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో జిల్లాలోని 1160 పనులు చేపట్టాలని అధికారులు ప్రతిపాదనలు చేశారు. గ్రామాల్లో రోడ్లు, మురుగు కాలువలు నిర్మించేందుకు ఈ నిధులు కేటాయించారు. ఈ పథకం ద్వారా చేపట్టే పనులకు అక్టోబర్‌ 14వ తేదీ నుంచి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. డిసెంబరు నెలాఖరుకల్లా పనులు పూర్తి చేశారు. పనులు పూర్తి చేసి సుమారు 9 నెలలు కావస్తున్నా నేటికీ డబ్బులివ్వకపోవడంతో పనులు చేసిన కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. కొంతమందయితే అప్పులు చేసి మరీ పనులు చేశారు. నేటికీ నిధులు మంజూరు కాకపోవడంతో అప్పులపాలయ్యామని, వచ్చే ఆదాయం వడ్డీకి కూడా సరిపోదని, దీంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలలో ప్రతి మూడో శనివారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్న ఆదేశాలు జిల్లాలోని ఒక్క పంచాయతీలో కూడా అమలవుతున్న దాఖలాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఉద్దరిస్తుందని ఆశపడ్డామని, చివరికి మమ్మల్ని అప్పుల పాలు చేసిందని గ్రామ సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలలో నిధులున్నా.. లేకపోయినా తాగునీటి సరఫరా, వీధిలైట్లు, బ్లీజింగ్‌ వంటి ముఖ్య అవసరాలు తీర్చాల్సి ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం నిధులు ఇచ్చేదాక చూస్తూ ఊరుకోలేమని, అప్పు చేసైనా ప్రజల ఇబ్బందులు తీర్చి నిధులు వచ్చిన తర్వాత అప్పులు చెల్లించాల్సి వస్తోందన్నారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకుంటే మాకు చిప్పకూడు తప్పదని గ్రామ సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఆత్మ గౌరవం– ఆత్మ విశ్వాసం అంటూ ఊదర గొట్టిందే తప్ప చివరికి తమను అప్పులపాలు చేసిందని వాపోతున్నారు.

15వ ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు జిల్లాకు మంజూరైన సుమారు రూ.38 కోట్లు నిధులు రాక కుంటుపడిన అభివృద్ధి జిల్లాలో 200 మైనర్‌ పంచాయతీలకు ఈ నిధులే దిక్కు పల్లెపండుగ పేరుతో ఆర్భాటం రూ.140 కోట్లు కేటాయిస్తున్నామంటూ ప్రకటన సకాలంలో పనులు పూర్తిచేసినా డబ్బులివ్వని ప్రభుత్వం అప్పులపాలు అవుతున్నామంటూ కాంట్రాక్టర్ల ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement