
స్మార్ట్ మీటర్లు ధ్వంసం చేద్దాం
ఒంగోలు సిటీ: ఇళ్లు, దుకాణాలు, పరిశ్రమలు, వ్యవసాయ బోర్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేస్తే ధ్వంసం చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. ‘స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి. తెలుగుదేశం మీకు అండగా ఉంటుంది’ అని ఎన్నికల సమయంలో చెప్పిన మాటను నారా లోకేష్‌తోపాటు కూటమి ప్రభుత్వ పెద్దలు మరిచి, మళ్లీ స్మార్ట్ మీటర్లు బిగించేందుకు సిద్ధమై ప్రజలను నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. విద్యుత్ బిల్లులు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలమైందని విమర్శించారు. గురువారం ఒంగోలులోని ఎల్‌బీజీ భవన్‌లో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు, ఏఐఎఫ్‌టీయూ(న్యూ) జిల్లా కార్యదర్శి ఎంఎస్ సాయి అధ్యక్షతన ప్రజా సంఘాల ఐక్య వేదిక సమావేశం నిర్వహించారు. స్మార్ట్ మీటర్లు వద్దని, ట్రూ అప్ పేరుతో ప్రజలపై వేల కోట్ల భారాన్ని మోపే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే తీర్మానాలు చేశారు. ఈ నెల 26 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు జిల్లాలో అర్జీలు సేకరించి విద్యుత్ భవన్ వద్ద ధర్నా చేపడతామని పేర్కొన్నారు. ఈ మేరకు కరపత్రాలు, అర్జీలు ఆవిష్కరించారు.
సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరు రంగారావు మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లులు, ఇంధన ధరలు తగ్గిస్తానన్న హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ట్రూఅప్ చార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపై రూ.19 వేల కోట్లకు పైగా భారం మోపారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గంటెనపల్లి శ్రీనివాసులు ధ్వజమెత్తారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి.బాలకోటయ్య మాట్లాడుతూ.. స్మార్ట్ మీటర్లు అన్ని రకాలుగా ప్రజలకు నష్టదాయకమన్నారు. సమావేశంలో దామా శ్రీనివాసులు, కౌలు రైతు సంఘ జిల్లా కార్యదర్శి వి.బాలకోటయ్య, పౌర సంఘాల సమాఖ్య నాయకులు జి.రమేష్, మున్వర్ బాషా, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి.రఘురాం, తంబి శ్రీనివాసులు, ఎల్.రాజశేఖర్, వీరస్వామి, రిటైర్డ్ నాయకులు జి.శేషయ్య, బీవీ రావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కె.వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జజ్జూరి జయంతిబాబు, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి లలిత కుమారి, దాసరి సుందరం, తంగిరాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల ముందు నారా లోకేష్ కూడా అదే చెప్పాడు
విద్యుత్ బిల్లుల తగ్గింపులో సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలం
పెట్రోల్, డీజిల్ ధరలపై స్టేట్ ట్యాక్స్ పైసా తగ్గించలేదు
కూటమి సర్కారు తీరుపై
ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకుల ధ్వజం