
కంభంలో పట్టపగలే భారీ చోరీ
కంభం: కంభంలో పట్టపగలే దుండగలు రెచ్చిపోయారు. స్థానిక కాపవీధిలో గురువారం మధ్యాహ్నం 24 తులాల బంగారం, రూ.40 వేల నగదు అపహరించారు. వివరాల్లోకి వెళితే.. కాపవీధిలో నివాసం ఉంటున్న మద్దూరి పుల్లయ్య అతని భార్య రంగలక్ష్మమ్మ గురువారం ఉదయం పొలం పనులకు వెళ్లారు. మధ్యలో 11 గంటల సమయంలో పుల్లయ్య ఇంటివద్దకు వచ్చి వెళ్లాడు. ఆ తర్వాత తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంటికి రాగా ఇంటి తలుపు తెరిచి ఉండటం గమనించాడు. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని వస్తువులన్నీ చిందరవందరగా కనిపించాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కంభం సీఐ కె. మల్లికార్జున, ఎస్సై నరసింహారావు చోరీ జరిగిన గృహాన్ని పరిశీలించి క్లూస్‌టీంను పిలిపించి వేలిముద్రలు సేకరించారు. బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. పుల్లయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉండగా ఒక కుమారుడు హైదరాబాద్‌లో, మరో కుమారుడు విజయవాడలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నారు. త్వరలో బంధువుల పెళ్లి ఉండటంతో ఇద్దరు కొడుకులు, కోడళ్ల నగలు తీసుకువచ్చినట్లు పుల్లయ్య తెలిపాడు. పెళ్లయిన తర్వాత నగలు బ్యాంకులో పెట్టి పొలం పెట్టుబడులకు డబ్బులు తెచ్చుకుందామనుకునే లోపే ఇలా జరిగిందని బాధితుడు వాపోయాడు. బీరువాలో సుమారు 24 తులాల బంగారు నగలుతో పాటు పొలం పెట్టుబడుల కోసం తెచ్చి పెట్టుకొని ఉన్న రూ. 40 వేల నగదు అపహరించుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.
పట్టపగలే చోరీతో భయభ్రాంతులు
కాపవీధిలో నివాసం ఉండే వారంతా రైతులు, పొలం పనులకు వెళ్లే వారు కావడంతో నిత్యం అక్కడి వారు బయట అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటుంటారు. పట్టపగలే చోరీ జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో దొంగతనాలు జరగలేదని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తూ చోరీకి పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు రాత్రిళ్లు గస్తీ తిరుగుతుంటే దొంగలు పగటి పూట చేతివాటం చూపిస్తుండటం ఆందోళన కలిగిస్తోందని, దొంగతనాల నివారణకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
బస్టాండు సమీపంలో పర్సు చోరీ
స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే మార్గంలో ఓ మహిళ సంచిని కట్ చేసిన వ్యక్తి అందులోని పర్సును అపహరించుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. పర్సులో సుమారు రూ. 8 వేల నగదు ఉన్నట్లు సమాచారం.
భార్యభర్తలిద్దరూ పొలం పనులకు వెళ్లి వచ్చేసరికి ఇల్లు లూటీ
24 తులాల బంగారం, రూ.40 వేల నగదు అపహరణ