
మొక్కుబడిగా కేంద్ర బృందం పర్యటన
పొదిలి రూరల్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పరిశీలించడానికి వచ్చిన అధికారుల పర్యటన మొక్కుబడిగా సాగింది. గురువారం పోదిలి మండలంలోని ఓబులక్కపల్లిలో ఎన్‌ఎల్‌ఎం సెంట్రల్ టీమ్ సభ్యులు ప్రభాత్ శర్మ, నందలాల్‌గుల్జార్ పర్యటించారు. ఉదయం 10 గంటలకు రావాల్సి ఉండగా మధ్యాహ్నం 12.50 గంటలకు గ్రామానికి చేరుకున్నారు. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం 10 నిమిషాలపాటు డ్వాక్రా గ్రూపులోని ఐదుగురు సభ్యులతో మాట్లాడారు. మీకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలతో వ్యాపారం బాగా సాగుతోందా, లాభాలు ఎలా ఉన్నాయి, ఆర్థికంగా ఎదిగారా? అని ప్రశ్నించగా గ్రూపు సభ్యులు మౌనంగా ఉండిపోయారు. అనంతరం అంగవైకల్యం, వితంతువు, మానసిక రోగి అయిన ముగ్గురు పింఛనుదారులతో మాడ్లాడి ముందుకు కదిలారు. ఈ సమయంలో కొంతమంది మహిళలు గ్రామంలో తాగునీరు రావడం లేదని కేంద్ర బృందం దృష్టికి తీసుకురాగా కలెక్టర్‌కు తెలియజేస్తామని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం సీసీ రోడ్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణం, ఉపాధి హామీ పనులను అధికారులు పరిశీలించాల్సి ఉంది. అయితే తూతూ మంత్రంగా సమావేశం ముగించుకుని వెళ్లే దారిలో ఫారం పాండ్ పనులను పరిశీలించి మమ అనిపించారు. మొత్తం మీద తొలిరోజు కేంద్ర బృందం పర్యటన గంట సేపు మాత్రమే సాగింది. కార్యక్రమంలో డీఆర్‌డీఏ ఏపీడీ లక్ష్మీరెడ్డి, డ్వామా ఏపీడీ బసవ సుబ్బారావు, ఎంపీడీఓ గుత్తా శోభన్‌బాబు, ఏపీఓ మహాలక్ష్మి, ఏపీఎం గోపాలకృష్ణ, పీఆర్ ఏఈ రామకృష్ణ పాల్గొన్నారు.
ఎంపీడీఓపై లైంగిక వేధింపుల కేసు
తర్లుపాడు: ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు మండల పరిషత్ కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తున్న మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై బ్రహ్మనాయుడు తెలిపారు. కార్యాలయంలో గత కొన్నేళ్లుగా స్వీపర్‌గా పని చేస్తున్న తనను బుధవారం ఎంపీడీఓ పిలిచి శ్రీబాత్రూం నీట్‌గా కడగలేదేంటిశ్రీ అంటూ అసభ్యంగా ప్రవర్తించారని, పెనుగులాటలో తన గాజులు కూడా పగిలాయని స్వీపర్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సై వివరించారు.