
మూగజీవాల అపహరణ..?
మర్రిపూడి: మేతకు వెళ్లి మూగజీవాలను అపహరిస్తున్నారు. వారం రోజులుగా మండల పరిసరాల్లో ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి. వివరాలలోకి వెళితే..మర్రిపూడి పరిసర గ్రామాల్లో వేసవిలో పచ్చదనం కరువు అవుతుంది. ఈ క్రమంలో పచ్చిమేతకోసం గ్రామాల్లోని మూగజీవాలను పొలాలకు విడిచిపెడతారు. ఎవరూ వాటిని కాపలా కాయరు. ఇది అనాదిగా వస్తోంది. పశువులన్నీ సమీపంలోని పచ్చిక దొరికే కొండ ప్రాంతానికి వెళ్లి మేతమేసి సాయంత్రానికి ఇళ్లకు చేరతాయి. వీటిలో సూడు, పాలిచ్చేవి, ఎడగేదెలు, ఏడాది వయస్సు పైబడిన దూడలన్నింటినీ మేతకోసం పొలానికి తోలుతుంటారు. ఇలా పశువులు మేతకోసం వెళ్లే క్రమంలో గమనించిన అక్రమార్కులు వాటిని అవి సంచరించే ప్రదేశం నుంచి గుట్టుచప్పడు కాకుండా వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు పశుకాపరులు భావిస్తున్నారు. గత కొంత కాలంగా మేతకు వెళ్లిన పశువులు ఎంతకు ఇంటికి తిరిగిరాకపోవడంతో వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో పశువులు మేతమేసే మేతపోరంబోకు భూముల్లో పశువులను ఒక గట్టుపైకి తరలించి అక్కడి నుంచి బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి తరలించినట్లుగా వాహనాల అనవాళ్లను గుర్తుంచారు. ఇటీవల వర్షాలు పడుతుండటంతో వాహనాల చక్రాల అనవాళ్లు, పశువులను వాహనాల్లో ఎక్కించే క్రమంలో అవి ఏవిధంగా ప్రవర్తిస్తాయో వాటికాలిముద్రలు, పేడ వంటివి ఆ ప్రాంతంలో కనిపించాయి. గతంలో కూడా గంగపాలెం, రేగలగడ్డ, మర్రిపూడి, పొట్టిరెడ్డిపాలెం, రాజుపాలెం, గుండ్లసముద్రం, వల్లాయపాలెం తదితర గ్రామాలకు చెందిన గేదెలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు బాధితులు తెలిపారు. మర్రిపూడి తూర్పుబజారులో సుమారు 10 గేదెలు, పడమటి బజారులో 6 గేదెలు వారం రోజులుగా మేత కోసం వెళ్లి కనిపించలేదు. వీటి విలువ రూ.18 లక్షలకు పైగా ఉంటుంది. దీంతో గురువారం వెతుకులాట ప్రారంచారు. ఈ క్రమంలో లక్ష్మీనృసింహస్వామి కొండ సమీపంలోని అడివిబీడులోని ఓ ఎత్తయిన ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు రెండు వాహనాల్లో వచ్చి గేదెలను అపహరించుకుపోయిన ఆనవాళ్లను గుర్తించారు. కొండప్రాంతంలో అక్రమంగా వాహనాల్లో ఎక్కించుకున్న గేదెలను పొదిలి, కంభాలపాడుగ్రామాల వైపు తరలించినట్లుగా ఆనవాళ్లు ఉన్నట్లు వారు భావిస్తున్నారు. బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో, సీసీ ఫుటేజ్‌ల పనుల్లో పోలీసులు నిమగ్నమయ్యారు.
వారం వ్యవధిలో మేతకు వెళ్లిన సుమారు రూ.18 లక్షల
విలువైన 16 గేదెలు మాయం
పశువులను వాహనాల్లో ఎక్కించి తీసుకెళ్లిన ఆనవాళ్లు