
రుణాల ఊసేలేదు..!
అంతా ఆర్భాటం..
వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలిచ్చి యువతను ఆర్థికంగా బలోపేతం చేస్తామంటూ కూటమి ప్రభుత్వ హామీ ఆర్భాటపు ప్రకటనలకే పరిమితమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాల మంజూరు ప్రక్రియ ప్రహసనంగా మారింది. ఎస్సీ కార్పొరేషన్ రుణాల ప్రక్రియ దరఖాస్తుల దశలోనే నిలిచిపోగా..బీసీల రుణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా సబ్సిడీ నగదు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తోంది. కూటమి ప్రభుత్వం
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండు ఆర్థిక సంవత్సరాలు పూర్తవుతున్నా కార్పొరేషన్ రుణాలు ఎండమావిగానే మిగిలాయని నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో వివిధ రకాల రుణాల వివరాలు
రుణాలు టార్గెట్ దరఖాస్తు గుర్తించిన
రకం చేసుకున్నవారు అర్హులు
బీసీ 1407 12,604 11,510
కాపు 197 3,553 3,228
బ్రాహ్మిణ్ 14 74 65
ఈబీసీ 41 262 225
క్షత్రియ 4 20 20
రెడ్డి 227 834 757
ఆర్యవైశ్య 49 422 377
కమ్మ 216 781 728
బీసీ రుణాలు మంజూరైనా అందని సబ్సిడీ నగదు
జిల్లాలో బీసీ కార్పొరేషన్ రుణాలు టార్గెట్ 1407 ఉంటే 12,604, కాపు కార్పొరేషన్‌లో టార్గెట్ 197కు 3,553 దరఖాస్తులు అందాయి. బీసీ స్వయం ఉపాధి రుణాల ఎంపికల కోసం వేలాది మంది పేదలు, నిరుద్యోగుల, ప్రజాప్రతినిధుల వద్దకు క్యూ కట్టారు. అధికార పార్టీ నాయకులు చెప్పిన అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఎంపీడీఓలు బ్యాంకులకు జాబితాలు పంపించారు. టార్గెట్ ఇచ్చిన బ్యాంకుల నుంచి అప్రూవల్ చేసి ఎంపీడీఓ లాగిన్‌కు బ్యాంకు అధికారులు పంపారు. ఇక్కడి నుంచి బీసీ కార్పొరేషన్ లాగిన్‌కు పంపడం అనుమతులు ఇవ్వడం జరిగిపోయింది. ప్రభుత్వం సబ్సిడీ నిధులు విడుదల చేయకపోవడంతో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమకాలేదు. యూనిట్లు పెట్టుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్న లబ్ధిదారులు నగదు అందక నానా అవస్థలు పడుతున్నారు.
బేస్తవారిపేట/ఒంగోలు వన్‌టౌన్:
రాష్ట్రంలో స్వయం ఉపాధి పథకాల అమలులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. కార్పొరేషన్ రుణాల మంజూరు అంటూ ఊరిస్తూ ప్రకటనలకే పరిమితమవుతోంది. ప్రభుత్వ సహకారంతో బ్యాంకుల చేదోడుతో జీవితంలో స్థిరపడదామనుకుంటున్న యువత కల సాకారం కావడం లేదు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు వివిధ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధికి రుణాలు ఇస్తామని హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఒక్కరికి కూడా రుణం ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. గత ఏప్రిల్ నెలలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కార్పొరేషన్ రుణాలు ఇస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది.
ఎస్సీ స్వయం ఉపాధి రుణాలు ఇలా..
ఫ్లవర్ బొకే మేకింగ్ అండ్ డెకరేషన్, వర్మీకంపోస్టు అండ్ ఆర్గానిక్ మాన్యూర్, ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రీషియన్ సర్వీసెస్, వాటర్ రీసైక్లింగ్, మొబైల్ రిపేరింగ్, సోప్ అండ్ డిటర్జంట్ మేకింగ్, వెల్డింగ్ అండ్ ఫాబ్రికేషన్ యూనిట్, సోలార్ ఎనర్జీ సేల్స్, ప్రమోషన్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, జనరిక్ మందుల దుకాణాలు, బ్యాటరీ ఆటోలు, బేకరీలు తదితర సెక్టార్ల ద్వారా రుణాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సెక్టార్ టైప్–1 రూ.3 లక్షల వరకూ 60 శాతం సబ్సిడీతో 3770 యూనిట్లు, సెక్టార్ టైప్–2 రూ.3 లక్షలకు పైగా రుణం 40 శాతం సబ్సిడీతో 10,490 యూనిట్లను గ్రౌండింగ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఐఎస్‌బీ సెక్టార్ టైప్–3 రూ.10 లక్షల కంటే ఎక్కువ రుణాలు 40 శాతం సబ్సిడీతో 10 (ఈవీ బ్యాటరీ చార్జింగ్) యూనిట్లను గ్రౌండింగ్ చేయాలి. ట్రాన్స్‌పోర్టు సెక్టార్ ఈ–ఆటోలు రూ.3 లక్షల వరకూ 50 శాతం సబ్సిడీతో 780 యూనిట్లు గ్రౌండింగ్ చేయాలి. అయితే ఇవి దరఖాస్తు దశలోనే నిలిచిపోవడం గమనార్హం.
బీసీ రుణాలు ఇలా..
బీసీ స్వయం ఉపాధి రుణాల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. బీసీలతో పాటూ, ఈబీసీ, రెడ్డి, ఆర్య, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్‌ల ద్వారా రుణాలు అందిస్తామని చెప్పింది. బీసీలకు ఫిష్ ఫార్మింగ్, వాటర్ బాటిల్స్ రీసైక్లింగ్, ఫ్‌లైయాష్ బ్రిక్, ప్లంబింగ్, ఎల్‌ఈడీ బల్బుల అసెంబ్లింగ్ యూనిట్, వెబ్‌సైట్ డెవలప్‌మెంట్, మూడు చక్రాల ఆటో, గూడ్స్ సరఫరా చేసే ట్రక్, నాలుగు చక్రాల ఆటో మొబైల్ కార్ వాష్, బేకరీలు, మెడికల్ ల్యాబ్స్, బ్యూటీ పార్లర్, వంటి వాటిని ఏర్పాటు చేసుకునేలా యూనిట్లను నిర్ణయించింది. స్లాబ్–1 లో రూ.2 లక్షల వరకూ, స్లాబ్–2లో రూ.2– రూ.3 లక్షల వరకూ, స్లాబ్–3లో రూ.3–రూ.5 లక్షల వరకూ 50 శాతం సబ్సిడీతో మిగిలిన నగదును బ్యాంక్ రుణం ద్వారా అందిస్తామని పేర్కొంది.
కార్పొరేషన్ రుణాల కోసం యువత ఎదురుచూపులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొండిచేయి బీసీ రుణాలు గ్రౌండింగ్‌కే పరిమితం.. సబ్సిడీ నిధులివ్వని ప్రభుత్వం దరఖాస్తు దశలోనే నిలిచిపోయిన ఎస్సీ కార్పొరేషన్ రుణాలు లబ్ధిదారుల ఎదురుచూపులు వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీలపై వివక్ష

రుణాల ఊసేలేదు..!