ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి

Jul 24 2025 8:57 AM | Updated on Jul 24 2025 8:57 AM

ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి

ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి

డీఈఓకు టీచర్స్‌ గిల్డ్‌ వినతి

ఒంగోలు సిటీ: ఎయిడెడ్‌ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ గిల్డ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే వెంకట్రావు, సీహెచ్‌ ప్రభాకర్‌ రెడ్డి బుధవారం డీఈఓ కిరణ్‌కుమార్‌ను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 16 ఎయిడెడ్‌ పాఠశాలల్లో జీరో ఎన్‌రోల్‌తో పనిచేస్తున్న 48 మంది ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు ఒక పాఠశాలలో పనిచేసేలా ఆర్డర్‌ ఇవ్వాలన్నారు. జిల్లాలో మిగులుగా ఉన్న 120 మంది ఉపాధ్యాయులకు మండల విద్యాశాఖ అధికారులు రోజుకో పాఠశాల చొప్పున వివిధ పాఠశాలలకు పంపుతున్నారని, వారికి శాశ్వతంగా సంవత్సరం మొత్తం ఒక పాఠశాలను కేటాయించి పేస్‌ అటెండెన్స్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. ప్రభుత్వ విద్యార్థులకు ఇచ్చే అన్ని రకాల వసతులు ఎయిడెడ్‌ విద్యార్థులకు కల్పించాలన్నారు. ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల జీతాల సమస్యను పూర్తిగా జీవో నంబర్‌ 155 ప్రకారం మండల విద్యాశాఖ అధికారులకు పూర్తి బాధ్యత ఇవ్వాలన్నారు. ఎయిడెడ్‌ పాఠశాలలకు అన్ని రకాల సమగ్ర శిక్ష అభియాన్‌ నిధులు విడుదల చేయాలన్నారు. పై సమస్యలను డీఈఓ కోఆర్డినేషన్‌ మీటింగ్‌ ద్వారా పరిష్కరించాలని కోరారు.

క్షయ బాధితులకు

ఆర్థిక సాయం

ఒంగోలు సబర్బన్‌: క్షయ బాధితులకు మంచి పోషకాహారం కోసం గ్రానైట్‌ పరిశ్రమల యజమానులు ఆర్ధిక సాయం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని మీ కోసం సమావేశ మందిరంలో బుధవారం కలెక్టర్‌ ఏ.తమీమ్‌ అన్సారియాకు అందజేశారు. జిల్లాలోని 12 మంది గ్రానైట్‌ పరిశ్రమల యజమానులు రూ.2,60,000 లను విరాళంగా ఇచ్చారు. కలెక్టర్‌ చేతుల మీదుగా జిల్లా క్షయ నివారణ అధికారి శ్రీవాణికి అందించారు. విరాళం ఇచ్చిన వారికి ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రశంస పత్రాలు ఇచ్చారు.

వీరయ్య హత్య కేసులో ముప్పా అనిత విచారణ

ఒంగోలు సిటీ: టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య కేసులో నిందితుడైన ముప్పా సురేష్‌ భార్య అనిత విచారణకు హాజరయ్యారు. బుధవారం డీఎస్పీ కార్యాలయంలో విచారణాధికారి డీఎస్పీ రాయపాటి శ్రీనివాస్‌ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆమెను విచారించారు. వీరయ్య చౌదరిని హత్య చేసేందుకు హైదరాబాద్‌ లోని ముప్పా నివాసంలో ముప్పా సురేష్‌, వినోద్‌లు మాట్లాడుకునే సమయంలో ఆమె అక్కడే ఉన్నారని పోలీసుల విచారణలో నిందితులు చెప్పినట్లు పోలీసులు ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెను విచారణకు హాజరు కావాలని ఈ నెల 5వ తేదీన 35(3) బీఎన్‌ఎస్‌ఎస్‌ నోటీసులు ఇచ్చారు. ముందస్తు బెయిల్‌ కోసం ముప్పా సురేష్‌ హైకోర్టులో దరఖాస్తు చేసుకోవడంతో పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు సమయం అడిగారు. ముందస్తు బెయిల్‌ ను కోర్టు తిరస్కరించడంతో ఆమె పోలీసు విచారణకు హాజరయ్యారు.

పెండింగులో దరఖాస్తులు.. ఇబ్బందుల్లో వైద్యులు

కలెక్టర్‌ జోక్యానికి వినతి

మార్కాపురం: జిల్లా వ్యాప్తంగా నూతన స్కానింగ్‌ సెంటర్లకు అనుమతి, పాత స్కానింగ్‌ సెంటర్లకు రెన్యువల్స్‌ రాక 4 నెలల నుంచి వైద్యులు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ వ్యాధుల నిర్ధారణకు స్కానింగ్‌లు అవసరం. జిల్లాలో పలుచోట్ల నూతన వైద్యశాలలు ఏర్పాటయ్యాయి. వీటిలో స్కానింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసుకోవాలంటే జిల్లా ఉన్నతాధికారులు అనుమతి ఇవ్వాలి. జిల్లాలో మార్కాపురం, టంగుటూరు, దర్శిల్లో నూతన హాస్పిటల్స్‌కు కొత్తగా అనుమతుల మంజూరు, త్రిపురాంతకం, పొదిలి తదితర ప్రాంతాల్లో పాతవాటికి రెన్యువల్స్‌ చేయాలి. అయితే నాలుగు నెలల నుంచి అనుమతులు రాకపోవడంతో ఆయా వైద్యశాలల డాక్టర్ల వద్దకు వచ్చే రోగులకు స్కానింగ్‌ సౌకర్యం లేకపోవడంతో అటు డాక్టర్లు, ఇటు రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ఇప్పటికై నా నూతన స్కానింగ్‌ సెంటర్లకు అనుమతులు ఇవ్వాలని పలువురు డాక్టర్లు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement