
పీ– 4 పథకంలో మార్గదర్శకులదే ప్రధాన పాత్ర
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్: పేదరికం లేని సమాజ ఆవిష్కరణ కోసం పీ – 4 పథకంలో మార్గదర్శకులుగా నిలిచి మీ వంతు సహకారం అందించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ప్రకాశం భవనంలోని మీ కోసం సమావేశ మందిరంలో బుధవారం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, పరిశ్రమలు, గ్రానైట్ సంఘాల ప్రతినిధులు, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, ఎరువులు, రసాయనాలు, డెయిరీ ఫారాల యజమానులతో ఆమె వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. పీ – 4 పథకం గురించి జెడ్పీ సీఈఓ చిరంజీవి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో 74 వేల కుటుంబాలను గుర్తించామని, ఆ కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచి పేదరికాన్ని అధిగమించేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పథకంలో స్వచ్ఛందంగా మార్గదర్శకులుగా ముందుకు రావాలని, శక్తి మేరకు ఎన్ని కుటుంబాలనైనా దత్తత తీసుకునే వెసులుబాటు ఉందని కలెక్టర్ తెలిపారు. మీ ప్రాంతంలోని ఈ చిన్నారుల చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసేందుకు పాఠశాలల యాజమాన్యాలు ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి అవసరమైన వైద్య సహాయం చేసేందుకు కూడా ప్రైవేట్ ఆస్పత్రులు ముందుకు రావచ్చన్నారు. బంగారు కుటుంబాల్లో అర్హులకు ఆస్పత్రిలో ఉద్యోగావకాశాలల్లో ప్రాధాన్యం కల్పించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డీఈఓ కిరణ్‌కుమార్, సీపీఓ స్వరూపరాణి, గనుల శాఖ డీడీ రాజశేఖర్, జిల్లా పరిశ్రమల సంస్థ మేనేజర్ శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్, డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, డీసీహెచ్‌ఎస్ శ్రీనివాస నాయక్, ఎన్‌టీఆర్ వైద్యసేవ జిల్లా సమన్వయకర్త హేమంత్, ఔషధ నియంత్రణ శాఖ ఏడీ జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇన్‌స్పైర్–మనక్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
● డీఈఓ కిరణ్‌కుమార్
ఒంగోలు సిటీ: జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు ఇన్‌స్పైర్–మనక్ అవార్డులకు తప్పనిసరిగా దరఖాస్తు చేయాలని డీఈఓ కిరణ్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజ్ఞాన, శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులకు మక్కువ పెంచేలా, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా విద్యార్థులకు ప్రాజెక్టుల రూపకల్పనలో మార్గనిర్దేశం చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఇన్‌స్పైర్ మనక్ వెబ్ పోర్టల్‌లో ప్రాథమికోన్నత పాఠశాలలు 3 నామినేషన్లు, హైస్కూళ్లు 5 నామినేషన్లు, హైస్కూల్ ప్లస్ పాఠశాలలు 7 ఆలోచనలను నామినేట్ చేయవచ్చని స్పష్టం చేశారు. ఆగస్టు 15వ తేదీలోగా విద్యార్థుల ప్రాజెక్ట్ వివరాలు అప్‌లోడ్ చేయాలని తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జిల్లా నుంచి అత్యధిక నామినేషన్లు పంపేందుకు సహకరించాలని కోరారు. వివరాలకు డీఎస్‌ఓ రమేష్ 96669 55504ను సంప్రదించాలని సూచించారు. ఇంటర్మీడియెట్ విద్యార్థులను కూడా ప్రతి తరగతి నుంచి ఒకరిని చేర్చాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ప్రాణం కాపాడిన వెంటిలేటర్!
మార్కాపురం: పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని మార్కాపురం జీజీహెచ్‌లో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి ప్రాణం కాపాడారు. అత్యవసర సందర్భాల్లో రోగులను వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందించడం సాధారణ విషయమే కానీ మార్కాపురం జీజీహెచ్‌లో మాత్రం ప్రత్యేకం. ఇక్కడ వెంటిలేటర్ సౌకర్యం లేనప్పుడు అత్యవసర వైద్య చికిత్స కోసం ఒంగోలు జీజీహెచ్‌కు రోగులను తరలించేవారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జీజీహెచ్‌లో 11 వెంటిలేటర్లు ఏర్పాటు చేయడంతో ఎంతో మంది రోగుల ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడ్డాయి. ఐసీయూ సేవలు కొన్ని నెలలుగా నిలిచిపోవడం, వెంటిలేటర్లు నిరుపయోగంగా వదిలేసిన విషయంపై ‘సాక్షి’లో ఇటీవల కథనం ప్రచురించడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. వారం క్రితం ఐసీయూ వార్డును మంత్రి డోలా, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యే కందుల కలిసి పునఃప్రారంభించారు. ఆ వెంటిలేటర్ సేవలే ఇప్పుడు ఓ వ్యక్తి ప్రాణం కాపాడాయి. తర్లుపాడుకు చెందిన వి.గాలెయ్య పురుగుమందు తాగడంతో కుటుంబ సభ్యులు మార్కాపురం జీజీహెచ్‌కు తీసుకురాగా వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు ప్రాణం కాపాడినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రామచంద్రరావు తెలిపారు. డాక్టర్ మధుకిరణ్, డాక్టర్ ఉష అత్యవసర చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి గాలెయ్యను రక్షించారని వివరించారు.

పీ– 4 పథకంలో మార్గదర్శకులదే ప్రధాన పాత్ర