
ఎయిడెడ్ పోస్టుకు నిర్వహించే పరీక్షకు హాల్‌టికెట్లు
ఒంగోలు సిటీ: ఉమ్మడి ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వల్లపల్లి గ్రామంలోని సీఏ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఖాళీగా ఉన్న ఎస్జీటీ ఎయిడెడ్ పోస్టు భర్తీ కోసం ఈ నెల 27వ తేదీ నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు అప్లికేషన్ ఐడీ, పుట్టిన తేదీని సీఎస్‌ఈ పోర్టల్‌లో సమర్పించి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని డీఈఓ కిరణ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజీ, నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజీ అటానమస్ బ్లాక్–4లో నిర్వహించే పరీక్ష కేంద్రాల్లో ఉదయం గం.9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు రెండో సెషన్ జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ పరీక్ష కేంద్రానికి హాల్‌టికెట్లతో పాటు ఏదైనా గుర్తింపు కలిగిన ద్రువపత్రంతో ఒక గంట ముందుగా హాజరు కావాలని కోరారు.
ఏకేయూ పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి విశ్వ విద్యాలయం పరిధిలోని పీజీ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి సెమిస్టర్ పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను ఏకేయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పరీక్షలకు మొత్తం 1025 మంది విద్యార్థులకు గాను, 932 మంది హాజరైనట్లు తెలిపారు. వీటిలో 752 మంది విద్యార్థులు 80.7 శాతం మేరకు ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ సీఈ ప్రొఫెసర్ జి.సోమశేఖర, ఏసీఈ డాక్టర్ ఏ.భారతీ దేవి, పీజీ కో ఆర్డినేటర్ (నాన్ కాన్ఫిడెన్షియల్) డాక్టర్ ఆర్.శ్రీనివాస్, పరీక్షల విభాగం పర్యవేక్షకుడు సూడా శివరామ్ తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నేడు ఉపాధ్యాయుల నిరసన
ఒంగోలు సిటీ: ఒంగోలు డీఈఓ కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం 4.30 గంటలకు నిర్వహించే నిరసన కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొని తమ నిరసన తెలియజేయాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ అబ్దుల్ హై, డీ వీరాంజనేయులు శనివారం ఒక ప్రకటనలో కోరారు. బదిలీలు, పదోన్నతులు పూర్తయి రెండు నెలలైనా ఉపాధ్యాయుల క్యాడర్ స్ట్రెంత్, పొజిషన్ ఐడీలు ఇంత వరకు ఇవ్వలేదన్నారు. రెండు నెలల నుంచి జీతం రాక ఉపాధ్యాయులు ఆర్ధికంగా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కౌన్సెలింగ్ ద్వారా బదిలీ అయినా రిలీవర్ రాక అదే స్కూల్లో నిలిచిపోయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న సుమారు 600 ఎస్జీటీ పోస్టుల్లో తాత్కాలికంగా అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలని కోరారు. ఉపాధ్యాయులను బోధనకు కాకుండా, బోధనేతర కార్యక్రమాలు విపరీతంగా పెంచి మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు పేరుకుపోయాయని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.