
వర్క్ అవుట్ సోర్సింగ్ చర్యలు ఆపాలి
ఒంగోలు సిటీ: మున్సిపల్ కార్మికుల పొట్టగొట్టి కాంట్రాక్టర్ల బొజ్జ నింపే వర్క్ అవుట్ సోర్సింగ్ చర్యలు ఆపాలని మున్సిపల్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఒంగోలు మున్సిపల్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం శుక్రవారం సీఐటీయూ ప్రకాశం జిల్లా కార్యాలయంలో జీ నరసింహ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా కె.ఉమామహేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 12 నుంచి ఇంజినీరింగ్ కార్మికులు, 16వ తేదీ నుంచి పారిశుద్ధ్య కార్మికులు పది రోజుల పాటు సమ్మె చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమంపై ఉక్కుపాదం మోపాలని ప్రయత్నించిందన్నారు. కార్మికుల ఐక్య పోరాటం వల్ల కొంతమేర ప్రభుత్వం దిగివచ్చి ఇంజినీరింగ్ కార్మికుల వేతనాలు పెంచటం, పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన సంక్షేమ పథకాల జీవోలు, సమ్మెకాలపు వేతనం ఇస్తానని 22వ తేదీ మున్సిపల్ శాఖ మంత్రి దగ్గర జరిగిన చర్చల్లో మంత్రి హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ఆగస్టు 5 తర్వాత రిలే నిరాహార దీక్షలు, అప్పటికీ కూటమి ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థలో రెండు డివిజన్‌ల పరిధిలో వర్క్ అవుట్‌సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చి చాప కింద నీరు లాగా ఆప్కాస్ ను ఎత్తేసి మళ్లీ లోకల్ ఏజెన్సీలకు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిందని తెలిపారు. టెండర్లు పిలిచారని, వెంటనే వాటిని రద్దు చేయాలని నెల్లూరులోని మున్సిపల్ కార్మికులు ఈనెల 12వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారన్నారు. ఈ విధానాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేయడానికి ప్రయత్నం మొదలుపెట్టిందన్నారు. వెంటనే వర్క్‌అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు మరో పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ నేను మారిపోయాను అన్న చంద్రబాబు.. మళ్లీ మన రాష్ట్రంలో ప్రపంచీకరణ మొదలుపెట్టారని, స్మార్ట్ మీటర్లు, కరెంటు బిల్లులను విపరీతంగా పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. వెంటనే ఈ విధానాలు ఆపాలని, లేదంటే కార్మికులు ఉద్యమబాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.నాగభూషణం, కోశాధికారి జ్యోతి బసు, సీఐటీయూ నగర కార్యదర్శి, యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు కె.సామ్రాజ్యం, యు.రత్నకుమారి, యూనియన్ నగర జిల్లా కార్యదర్శి కొర్నేపాటి శ్రీనివాసరావు, టి.విజయమ్మ, ఆనంద్, వై రవి, ఎం బాబు, జేమ్స్, కె.వంశీ, మోహన్ రావు, ఇంజినీరింగ్, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
మున్సిపల్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు