దగా | - | Sakshi
Sakshi News home page

దగా

Jul 26 2025 10:00 AM | Updated on Jul 26 2025 10:00 AM

దగా

దగా

కలగా కేంద్రాలు..
కొ
నుగోళ్లు!

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

మోసపు ప్రకటనలతో పొగాకు రైతులను ప్రభుత్వం దగా చేస్తోంది. మద్దతు ధర కోసం రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న రైతులను మభ్య పెట్టేందుకు పొగాకు వేలం ప్రక్రియలో మార్క్‌ఫెడ్‌ పాల్గొంటుందని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. నెల రోజులు దాటుతున్నా మార్క్‌ఫెడ్‌ ద్వారా ఒక్క కేజీ కూడా కొనుగోలు చేయలేదు. పొగాకు బోర్డు ప్రకాశం రీజియన్‌లోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో మొత్తం 11 వేలం కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 2024–25 ఏడాదికి గాను 105.27 మిలియన్‌ కేజీల పొగాకును అమ్ముకునేందుకు పొగాకు బోర్డు అనుమతిచ్చింది. ఈ మేరకు ఈ ఏడాది మార్చి 10, 19వ తేదీల్లో రెండు దశల్లో అన్ని వేలం కేంద్రాల్లో పొగాకు వేలం ప్రక్రియ ప్రారంభమైంది. నాలుగేళ్లకు భిన్నంగా ఈ ఏడాది వేలం ప్రారంభం నుంచే రైతుకు మద్దతు ధర కరువైంది. కర్నాటకలో మంచి ధరలు రావడంతో ఇక్కడా అలాగే ఉంటుందని రైతులు ఆశపడ్డారు. అయితే కంపెనీల మాయాజాలం, బోర్డు అధికారుల చేతివాటం, ప్రభుత్వ నిర్లక్ష్యం వెరసి రైతుకు మద్దతు ధర కరువైంది. కేవలం బ్రైట్‌ గ్రేడ్‌ పొగాకు మాత్రమే కేజీకి రూ.280 ఇచ్చిన వ్యాపారులు, మిగిలిన గ్రేడ్‌ల ధరలు దారుణంగా తగ్గించేశారు. ఇప్పటి వరకు వచ్చిన సరాసరి ధర చూస్తే కేజీకి కేవలం రూ.241 మాత్రమే. ఈ నేపథ్యంలో మద్దతు ధరలు ఇవ్వాలని రెండు నెలలుగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వేలం ప్రక్రియను అడ్డుకోవడంతో పాటు, రోడ్లపైకి వచ్చి పొగాకు తగులబెట్టి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతులకు అండగా నిలిచారు. రైతులకు మద్దతు ధరలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వేలంలో పోటీని పెంచేందుకు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించుతున్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు మార్క్‌ఫెడ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. సరికదా జిల్లాలోని ఏ వేలం కేంద్రంలో కూడా ఇప్పటి మార్క్‌ఫెడ్‌ తరఫున ఒక్క కేజీ పొగాకును కూడా ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయలేదు. వాస్తవానికి గతంలో ఒకసారి పొగాకు మార్కెట్‌లో ధరల సంక్షోభం ఏర్పడినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి పొగాకును కొనుగోలు చేయించారు. దీంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ధరలు అమాంతం పెరిగాయి. నాలుగేళ్లుగా రైతులు లాభాలు చవిచూశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు తలకిందులయ్యాయి. ప్రభుత్వం ఉత్తుత్తి ప్రకటనలకే పరిమితమైంది తప్ప రైతులను ఆదుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.

ఆర్భాటపు ప్రకటనలతో కాలయాపన..

పొగాకు వేలం ప్రక్రియ ప్రారంభమై దాదాపు నాలుగు నెలల కావస్తోంది. 11 వేలం కేంద్రాల పరిధిలో అధికారిక, అనధికారి పొగాకు ఉత్పత్తి కలుపుకుని 142 మిలియన్‌ కేజీలు ఉండొచ్చని అంచనా. దీనిలో ఇప్పటికే 76.58 మిలియన్‌ కేజీల పొగాకును రైతులు అమ్ముకున్నారు. అంటే దాదాపు 50 శాతానికి పైగా రైతులు ఉత్పత్తులను అరకొర ధరలకే విక్రయించారు. అయినా సరే ఇప్పటికీ ప్రభుత్వం మద్దతు ధరలు కల్పించలేదు. తాజాగా ఒక్కో రైతు నుంచి 20 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. అయితే తక్కువ పండించిన రైతులు ఇప్పటికే తమ వద్ద ఉన్న పొగాకును తక్కువ ధరలకు తెగనమ్ముకున్నారు. ప్రభుత్వం ఇప్పుడు వేలం ప్రక్రియలోకి వచ్చినా సగం మంది రైతులకు కూడా ప్రయోజనం ఉండేలా కనిపించడం లేదు. ఇలా రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం మోసపు మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకోవాలి

14 ఎకరాల్లో పొగాకును పండించాను. 65 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇప్పటి వరకు వేలంలో 40 క్వింటాళ్ల పొగాకును వ్యాపారులు కొనుగోలు చేశారు. గత సంవత్సరంలో కేజీ రూ.360 పలికిన పొగాకు ఈ ఏడాది రూ.240, రూ.250 పలుకుతోంది. గిట్టుబాటు ధర దక్కకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నా. అధిక సంఖ్యలో బేళ్లు తిరస్కరణకు గురవుతూ అధిక భారం పడుతోంది. జూన్‌ 11వ తేదీన పొగాకు రైతుల గిట్టుబాటు ధర కోసం పొదిలి వేలం కేంద్రాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సందర్శించారు. ఆ తర్వాత ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ను రంగంలో దించి పొగాకు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఏమీ కొనలేదు. అమ్ముడుపోయిన పొగాకులో కూలీలకు ఇవ్వడానికి కూడా డబ్బులు రాలేదు. నా దగ్గర దాదాపు 25 క్వింటాళ్ల పొగాకు ఇంకా అమ్మకానికి ఉంది. దీన్నైనా మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసి ఆదుకోవాలి.

– సురేష్‌, పొగాకు రైతు, నేతివారిపాలెం

ఈ ఏడాది నష్టాలు తప్పవు

11 ఎకరాల్లో పొగాకు సాగు చేశాను. ఇందుకు రూ.22 లక్షలు పెట్టుబడి అయ్యింది. ఏటా ఒక ఎకరానికి 9 నుంచి 10 క్వింటాళ్ల పంట పండేది. ఈ ఏడాది దిగుబడి కూడా భారీగా తగ్గింది. ఒక్కో బ్యారన్‌కు రూ.4 లక్షల నష్టం వస్తోంది. ఇప్పటి వరకు పొగాకు బోర్డులో రెండు బ్యారన్‌లకు కేవలం 18 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. ఎప్పుడు వేలం కేంద్రానికి వెళ్లినా బేళ్లు తిరస్కరణకు గురౌతున్నాయి. ఇప్పుడు ఒక్కో రైతు వద్ద నుంచి 20 క్వింటాళ్లు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది.

– రాయిండ్ల వెంకట నారాయణ, పొగాకు రైతు, పొందుటూరు గ్రామం, టంగుటూరు మండలం.

దగా1
1/1

దగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement