
మున్సిపాలిటీల్లో శానిటేషన్ అధ్వానం
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో శానిటేషన్ అధ్వానంగా ఉందని వినియోగదారుల రక్షణ సంఘం(డీసీపీసీ) సభ్యులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. జేసీ ఆర్.గోపాల కృష్ణ అధ్యక్షతన శుక్రవారం ఆయన ఛాంబర్‌లో సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీపీసీ సభ్యులు వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఒంగోలు ఆర్‌టీసీ బస్టాండ్‌లో శానిటేషన్ అధ్వానంగా ఉందని, మరుగుదొడ్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని, కొన్ని చోట్ల మునిసిపల్ ఏరియాల్లో శానిటేషన్ బాగుండటం లేదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అలాగే కొన్ని చోట్ల గుంతలు ఎక్కువగా ఉండటం వలన ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారన్నారు. కరెంట్ వైర్లు కిందకు వేలాడుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతన్నారని చెప్పారు. ఒంగోలు నగరంలో అన్ని ప్రాంతాల్లో కుక్కల బెడద అధికంగా ఉందన్నారు. వృద్ధులు, చిన్నారులను కరిచి గాయాల పాలు చేస్తున్నాయని చెప్పారు. ఒంగోలు నగరంలో కోతులు బెడద కూడా ఎక్కువగా ఉందన్నారు. ఒంగోలులో ప్రజల సౌకర్యార్థం సిటీ బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా జేసీ గోపాల కృష్ణ స్పందిస్తూ వెంటనే ఒంగోలు, గిద్దలూరు, కనిగిరి మునిసిపల్ కమిషనర్లతో మాట్లాడి వారం రోజుల లోపల శానిటేషన్, గుంతలు కూడా సరిచేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తామన్నారు. కరెంట్ వైర్లు కిందకు వేలాడుతున్నందున వెంట సరిచేయాల్సిందిగా ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఏప్రిల్ నుంచి నెలలో ఒకరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డేగా ప్రకటిస్తున్నారని, జిల్లాలో ప్రతి నెలా ఆ రోజు 9, 10 శాఖల అధికారులతో తనిఖీలు చేస్తామన్నారు. సంబంధిత తహశీల్దారు, ఎన్‌ఫోర్సుమెంట్ డిప్యూటీ తహశీల్దార్లు, ఎలక్ట్రికల్ ఏఈ, ఫైర్ డిపార్ట్‌మెంట్, లీగల్ మెట్రోలజీ, ఫుడ్ సేఫ్టీ, రెవిన్యూ డివిజనల్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారి, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజరుతో పాటు జిల్లా సంయుక్త కలెక్టర్ కూడా తనిఖీల్లో పాల్గొంటారన్నారు. తనిఖీల్లో డీసీపీసీ సభ్యులు కూడా భాగస్వాములు కావాలని కోరారు. సమావేశాలో జిల్లా పౌరసరఫరాల అధికారి ఎస్.పద్మశ్రీ,, డీఎంహెచ్‌ఓ డాక్టర్ టి.వెంకటేశ్వర్లు, ఒంగోలు మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్ సుశీల, అసిస్టెంట్ కమిషనర్ లీగల్ మేట్రోలజీ స్వర్ణ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మహ్మద్ షంషేర్ ఖాన్, జిల్లా వినియోగదారుల సంఘం యం.నాగేశ్వరరావు, ఏనుగుల సురేష్, ఓ.సిహెచ్.నరసింహులు, వీరారెడ్డి, ప్రసాద్, మాధవ, కృష్ణరావు, బాలకృష్ణ, ఐ.నాగేంద్రరావు పాల్గొన్నారు.
వినియోగదారుల రక్షణ సంఘ సమావేశంలో జేసీకి సభ్యుల ఫిర్యాదు