నేడు రెజాంగ్‌ లా రాజ్‌ కలశ రథయాత్ర | - | Sakshi
Sakshi News home page

నేడు రెజాంగ్‌ లా రాజ్‌ కలశ రథయాత్ర

Jul 17 2025 3:14 AM | Updated on Jul 17 2025 3:14 AM

నేడు రెజాంగ్‌ లా రాజ్‌ కలశ రథయాత్ర

నేడు రెజాంగ్‌ లా రాజ్‌ కలశ రథయాత్ర

ఒంగోలు సబర్బన్‌: భారత సైన్యంలో అహిర్‌ రెజిమెంట్‌ (యాదవ రెజిమెంట్‌)ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు నిర్వహిస్తున్న రెజాంగ్‌ లా రాజ్‌ కలశ రథయాత్ర గురువారం ఉదయం 8 గంటలకు పెళ్లూరులోని గంగమ్మ గుడి (నేషనల్‌ హైవే) నుంచి ప్రారంభమవుతుందని అఖిల భారత యాదవ మహా సభ నాయకులు తెలిపారు. ఈ మేరకు యాదవ మహాసభ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు బొట్ల రామారావు యాదవ్‌, బొల్ల సుబ్బారావు యాదవ్‌ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పవిత్ర యాదవ వీరుల జ్ఞాపకార్థం లక్ష కిలో మీటర్ల మేర సాగే యాత్రను యాదవ పెద్దలు, నాయకులు, యువకులు, విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రెజాంగ్‌ లా రాజ్‌ కలశ్‌ యాత్ర ఏప్రిల్‌ 13 వ తేదీన బీహార్‌ లోని పాట్నా నుంచి మొదలైందన్నారు.

నేడు రోల్‌బాల్‌ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక

ఒంగోలు: రోల్‌బాల్‌ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక స్థానిక మంగమూరు రోడ్డులోని ప్రగతి ఎన్‌క్లేవ్‌ వద్ద గురువారం ఉదయం నిర్వహిస్తున్నట్లు రోల్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా ఇన్‌చార్జి గుర్రం అనీల్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్‌ 11, 14, 17, 17 ప్లస్‌ విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా ఎంపిక ఉంటుందన్నారు. ప్రతిభ కనబరిచిన వారితో జిల్లా జట్టును ఎంపిక చేసి వారిని ఈనెల 19, 20 తేదీల్లో కాకినాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు పంపుతారన్నారు. ఆసక్తిగలవారు ఆధార్‌కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, రోల్‌ బాల్‌ ఆఫ్‌ ఇండియా వారిచే ధ్రువీకరించిన గుర్తింపు పత్రం తీసుకురావాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా ఇన్‌చార్జి గుర్రం అనీల్‌కుమార్‌, సెల్‌:9100553717ను సంప్రదించాలన్నారు.

సెల్‌ ఫోన్‌ మరమ్మతులపై ఉచిత శిక్షణ

ఒంగోలు వన్‌టౌన్‌: ఒంగోలు రూడ్‌ సెట్‌ సంస్థ ఆధ్వర్యంలో సెల్‌ఫోన్‌ మరమ్మతుపై ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు ఆ సంస్థ డైరక్టర్‌ పి శ్రీనివాసరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి 30 రోజుల పాటూ సెల్‌ఫోన్‌ మరమ్మతు, సర్వీసింగ్‌పై ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన అభ్యర్థులు అర్హులన్నారు. అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారై ఉండాలని, ఆధార్‌ కార్డు, తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణ కాలంలో పూర్తి వసతి, భోజనం ఉచితంగా అందిస్తారని చెప్పారు. ఇతర పూర్తి వివరాలకు 8309915577 అనే నెంబరుపై సంప్రదించాలన్నారు.

బీఎడ్‌ మొదటి సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి విశ్వ విద్యాలయం పరిధిలోని 110 బీఎడ్‌ కళాశాలల్లో 2024–25 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం, మొదటి సెమిస్టర్‌ పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను ఏకేయూ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ డీవీఆర్‌ మూర్తి సూచనల మేరకు ఏకేయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.హరిబాబు బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ పరీక్షలకు గాను మొత్తం 11,331 మంది విద్యార్థులు నమోదు కాగా, వారిలో 10,481 మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో మొత్తం 10,394 మంది విద్యార్థులు పాసైనట్లు హరిబాబు విలేకర్లకు తెలిపారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను డి.వి.ఆర్‌.మూర్తి, బి.హరిబాబుతో పాటు ఏకేయూ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌.నిర్మలామణి, సీఈ ప్రొఫెసర్‌ జి.సోమశేఖర, పూర్వపు సీఈ, ప్రస్తుత సీడీసీ డీన్‌ డాక్టర్‌ కే.వి.ఎన్‌.రాజు తదితరులు అభినందించారు. కార్యక్రమంలో పీజీ కో ఆర్డినేటర్‌ (నాన్‌ కాన్ఫిడెన్షియల్‌ విభాగం) డాక్టర్‌ ఆర్‌.శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

345 బేళ్లు తిరస్కరణ

కొండపి: స్థానిక పొగాకు వేలం కేంద్రంలో బుధవారం నిర్వహించిన వేలంలో 345 బేళ్లు తిరస్కరణకు గురైనట్లు వేలం నిర్వహణ అధికారి జి. సునీల్‌కుమార్‌ తెలిపారు. క్లస్టర్‌ పరిధిలోని పెట్లూరు ఎన్‌.ఎన్‌. కండ్రిక, జగ్గరాజుపాలెం, వర్ధినేనివారిపాలెం గ్రామాలకు చెందిన రైతులు 1070 బేళ్లను వేలానికి తీసుకురాగా 725 బేళ్లనుకొనుగోలు చేశారు. గరిష్ట ధర రూ.281, కనిష్ట ధర రూ.160, సరాసరి ధర రూ.225.90గా నమోదైంది. వేలంలో 23 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement