
పురుగుమందుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
పెద్దారవీడు: గుంటూరు వ్యవసాయ కమిషనర్ అనుమతించిన ప్రిన్సిపుల్ సర్టిఫికెట్స్ లేని వివిధ రకాల పురుగుమందుల అమ్మకాలను నిలిపివేస్తూ అదేశాలు జారీ చేసినట్లు సెంట్రల్ స్క్వాడ్ అధికారి టి.శ్రీనివాసరావు తెలిపారు. మండలంలో హనుమాన్ జంక్షన్ కుంటలో పురుగుమందులు, విత్తనాల దుకాణాలను నెల్లూరు విజిలెన్స్ సీఐ షేక్ సుహాని, జిల్లా సాంకేతిక వ్యవసాయాధికారి వేణుగోపాల్ బృందం బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. రాష్ట్ర కమిషనర్ కార్యాలయం సూచించిన అనుమతి పత్రాలు చూపించని కారణంగా రూ.58.28 లక్షల విలువైన 12,427 కేజీల పురుగుమందుల అమ్మకాలను తాత్కాలింగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. స్టాక్ రిజిస్టర్‌లోని వివరాలకు గోడౌన్‌లో ఉన్న స్టాక్‌కు, ఎరువుల ఇన్‌వాయిస్‌లు, రైతులకు ఇచ్చిన బిల్లులను పరిశీలించారు. సెంట్రల్ స్క్వాడ్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికృత డీలర్ల నుంచి మాత్రమే ఎరువులు, విత్తనాలు కోనుగోలు చేయాలని రైతులకు సూచించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు చట్టాలకు లోబడి మాత్రమే వ్యాపారం చేసుకోవాలని, అతిక్రమిస్తే లైసెన్స్ రద్దుకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు. విత్తనాలు, ఎరువులు గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువకు అమ్మరాదని చెప్పారు. ఆయన వెంట మార్కాపురం సహాయ వ్యవసాయ సంచాలకులు బాలజీనాయక్, మండల వ్యవసాయాధికారి ఎన్.లక్ష్మీనారాయణ, ఏఈఓ సునీల్‌నాయక్, ఉన్నారు.