
బాబు మోసాలు ఎండగడదాం
● వై.పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం:
రాష్ట్ర ప్రజలకు కూటమి నాయకులు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, ఎన్నికల ముందు చేసిన వాగ్ధానాలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని, చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాన్ని ఎండగట్టాల్సిన సమయం వచ్చిందని వై.పాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లిన కూటమి నాయకులు ఒక బాండు చేతులో పెట్టి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని ప్రచారం చేశారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పిన కూటమి పెద్దమనుషులు.. 15 నెలలు కావస్తున్నప్పటికీ ఆ పథకాలు అమలు చేయకుండా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారన్నారు. విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పి సామాన్యుడి నడ్డివిరిగే విధంగా పెంచారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, దీనివలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, పేదలకు ప్రభుత్వ పరంగా దక్కాల్సిన లబ్ధి ఏ మాత్రం అందడం లేదని అన్నారు. ఎక్కడ పడితే అక్కడ దాడులు, భూ కబ్జాలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, ఇదేమిటని ప్రశ్నించిన వారిపై పోలీసులతో తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్‌లు చేయిస్తున్నారని ఆయన అన్నారు.
19న బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమం...
కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను నిలదీసి బాబు చేస్తున్న మోసాన్ని ప్రజలకు తెలిపేందుకు బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 19న త్రిపురాంతకం రోడ్డులోని వైష్ణవి గార్డెన్స్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తాటిపర్తి తెలిపారు. ముఖ్య అతిథులుగా వైఎస్సార్ సీపీ జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి హాజరవుతారని అన్నారు. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ కార్యక్రమానికి వివిధ విభాగాల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గృహ సారధులు, సచివాలయాల కన్వీనర్లు, కార్యకర్తలు అన్ని గ్రామాల నుంచి పెద్దఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీపీ దొంతా కిరణ్‌గౌడ్, జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, వివిధ విభాగాల రాష్ట్ర, జిల్లా నాయకులు ఒంగోలు మూర్తిరెడ్డి, షేక్ అబ్దుల్ మజీద్, ఉడుముల శ్రీనివాసరెడ్డి, గంటా రమణారెడ్డి, ఆళ్ల ఆంజనేయరెడ్డి, కె.ఓబులరెడ్డి, గుమ్మా ఎల్లేష్ యాదవ్, భూమిరెడ్డి సుబ్బారెడ్డి, సూరె రమేష్, ఆర్.అరుణాబాయి, ఉడుముల అరుణ, పల్లె సరళ, పి.కృష్ణారెడ్డి, వల్లభనేని పవన్‌కుమార్, శేషశయనారెడ్డి, ఎ.ఆదినారాయణ, రంగబాబు, జానకి రఘు పాల్గొన్నారు.