
బదిలీ అయిన ఉపాధ్యాయులకు జీతాలివ్వండి
● యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు
ఒంగోలు సిటీ: బదిలీ అయిన ఉపాధ్యాయులందరికీ జీతాలు వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. యూటీఎఫ్ ప్రకాశం జిల్లా కార్యదర్శివర్గ సమావేశం ఒంగోలు యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ హై అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ బదిలీ అయిన ఉపాధ్యాయులందరికీ జీతాలు ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. బదిలీలు పూర్తయి నెల రోజులైనా కొత్త పోస్టులకు పొజిషన్ ఐడీలు ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదని, వెంటనే పొజిషన్ ఐడీలు ఇచ్చి జీతాల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డీ వీరాంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో బదిలీ అయినా రిలీవర్స్ లేక చాలామంది ఉపాధ్యాయులు పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారన్నారు. డీఎస్సీ పోస్టులు ఇచ్చినా కూడా ఇంకా జిల్లాలో 500 ఎస్‌జీటీ ఖాళీలు ఉంటాయని, అర్హత ఉన్న అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ హై మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత పాత పీఆర్సీ కమిటీని రద్దు చేయడం తప్ప, పీఆర్సీ గానీ, ఐఆర్ ఊసే లేకపోవడాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయలు తీవ్రంగా నిరసిస్తున్నారని, మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నా కనీసం ఒక డీఏ గురించి కూడా మాట్లాడకపోవడం సరైంది కాదన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతారని హెచ్చరించారు.
కార్యవర్గ సమావేశం అనంతరం ఎస్‌టీఎఫ్‌ఐ ఆల్ ఇండియా ట్రైనియల్ కాన్ఫన్స్ పోస్టర్‌ను ఈసీ మెంబర్ కొమ్ముజు శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ హై, డీ వీరాంజనేయులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎస్ రవి, జీ ఉమామహేశ్వరి, ఎన్ చిన్నస్వామి, ఎం సత్యనారాయణ రెడ్డి, పీ బాల వెంకటేశ్వర్లు, సీహెచ్ ప్రభాకర్ రెడ్డి, ఎం సంధ్యారాణి పాల్గొన్నారు.