
నీటి సరఫరా పైపులు దోచుకెళ్తున్నారు
యర్రగొండపాలెం: పట్టణ ప్రజలకు తాగు నీరు సరఫరా చేయాలని వరల్డ్ బ్యాంక్ ఆర్థిక సహాయంతో దూపాడు నుంచి బొడ్రెడ్డిపల్లె జంక్షన్ మీదుగా స్థానిక ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయం ఆవరణలో ఉన్న సంప్ వరకు భూమిలో వేసిన పైపులను టీడీపీకి చెందిన ఒక కాంట్రాక్టర్ వెలికితీసి వేరే ప్రాంతంలో తాను కాంట్రాక్ట్ పనులు చేస్తున్న ప్రాంతానికి ఎత్తుకెళ్తున్నాడు. తమ అవసరాల కోసం వేసిన పైపులను అక్రమంగా తీసుకెళ్లడాన్ని స్థానికులు అభ్యంతరం తెలిపారు. ఈనేపథ్యంలో ఆదివారం ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ పైపుల వెలికి తీసే ప్రాంతాలను పరిశీలించారు. అప్పటికే వెలికి తీసిన పైపులను లారీల్లో ఎత్తుకెళ్తుండడాన్ని చూసి ఆయన అభ్యంతరం తెలిపారు. ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల గురించి మార్కాపురం సబ్ కలెక్టర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈలతో ఎమ్మెల్యే మాట్లాడారు. వాటి వివరాలను వారినుంచి అడిగి తెలుసుకొని పైపుల తరలింపును అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుక్కెడు నీళ్లు లేక ప్రజలు అలమటిస్తుంటే ఉన్న పైపులైన్ ద్వారా నీటిని అందించకుండా భూమిలో పైపులు వృథాగా పడి ఉన్నాయన్న సాకుతో ఎత్తుకెళ్లడం కూటమి ప్రభుత్వ అవినీతికి, దుర్మార్గపు చర్యలకు నిదర్శనమని అన్నారు. ఒక్కొక్క పైపు రూ.48 వేలు విలువ చేస్తాయని, వందల సంఖ్యలో పైపులను వెలికి తీసి వాటిని అప్పనంగా ఎత్తుకెళ్లి సొమ్ము చేసుకోవటానికి కాంట్రాక్టర్ పథకాన్ని రచించాడని ఆయన అన్నారు. అందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు కుమ్మక్కయి నేల లోపల ఉన్న పైపులను వెలికితీసి తీసుకొని వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం సరైన పద్ధతి కాదన్నారు. దొనకొండ మండలంలోని చందవరం స్కీం వద్దకు ఈ పైపులు తరలించి అక్కడి నుంచి కాంట్రాక్టర్ తాను తీసుకున్న కాంట్రాక్ట్ పనులకు ఉపయోగించుకునేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఒకటిన్నర కిలో మీటరు వరకు మాత్రమే పైపులను వెలికితీసుకునేందుకు అనుమతి ఇచ్చారని, కాంట్రాక్టర్ మాత్రం 26 కిలో మీటర్ల దూరం వరకు వేసిన పైపులను కాజేందుకు పూనుకున్నాడని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు దాదాపు 6 కిలో మీటర్ల మేర భూమిని తవ్వి పైపులను వెలికి తీశారని, అందులో రెండు కిలో మీటర్ల వరకు వెలికి తీసిన పైపులను తీసుకొని వెళ్లారని ఆయన వివరించారు. నేలలో వేసిన పైపులు వెలికి తీసి తీసుకెళ్లేందుకు ఈఎన్‌సీ శాఖ నుంచి ఎన్‌వోసీ పొందాలని, ఆ శాఖ సెక్రటరీ అనుమతి ఇచ్చిన తరువాత స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేతో చర్చించి పైపులు తొలగించాల్సి ఉందని, అటువంటి ప్రక్రియ ఏమీ లేకుండా ఎస్‌ఈ ఒకటిన్నర కిలో మీటర్ల మేర పైపులు తీసుకొని వెళ్లేందుకు ఏ విధంగా అనుమతి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. పైపులు దొంగలు ఎత్తుకొని వెళ్తున్నారని, ఈ కారణంగా నేల నుంచి బయటికి తీసిన పైపులు చందవరం స్కీంకు తరలించేందుకు అనుమతి ఇచ్చామని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. భూమిని తవ్వి పైపులను దొంగలు ఏ విధంగా ఎత్తుకొని వెళ్తారని, టీడీపీ దొంగలకే అది సాధ్యమవుతుందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. జాతీయ రహదారి 565లో డ్యామేజి అయిన పైప్‌లైన్‌కు ప్రత్యామ్నాయంగా అప్పట్లో దాదాపు రూ.7 కోట్లతో 90 సంవత్సరాల మన్నిక కలిగిన డీఐకే 7 పైపులను ఏర్పాటు చేశారని, అటువంటివి 20 సంవత్సరాలకే ఏ విధంగా చెడిపోతాయని ఆయన ప్రశ్నించారు. ప్రజల దాహార్తి తీర్చే ప్రధాన పైపులైన్ ఎప్పుడైనా చెడిపోతే ప్రత్యామ్నాయంగా ఈ పైప్‌లైన్ ఉపయోగపడుతుందని, లేకుంటే ఆ లైన్ ద్వారా మరో ప్రాంతానికి నీటి సరఫరా చేసేందుకు ఉపయోగించాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. ఈ పైపులు వెలికితీసి ఎత్తుకొని వెళ్లేందుకు నియోజకవర్గానికి చెందిన కూటమి నాయకుడి హస్తం కూడా ఉండి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వెలికి తీసిన పైపులను అధికారులు స్వాధీనం చేసుకొని నియోజకవర్గ ప్రజల నీటి అవసరాలు తీర్చేందుకు సద్వినియోగం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి కె.ఓబులరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్.అరుణాబాయి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జానకి రఘు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు పి.రాములు నాయక్, పుల్లలచెరువు వైస్ ఎంపీపీ లింగంగుంట్ల రాములు, సర్పంచ్‌లు ఆవుల కోటిరెడ్డి, తమ్మినేని సత్యనారాయణరెడ్డి, ఆవుల రమణారెడ్డి ఉన్నారు.
కోట్లాది రూపాయలు లబ్ధిపొందేందుకే టీడీపీ కాంట్రాక్టర్ ఎత్తుగడ కూటమి నాయకుడి అనుమతితోనే పైపులు ఎత్తుకెళ్తున్నారని ఆరోపణ పైపులైన్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్