
కోట, సరోజాదేవిలకు ఘన నివాళి
ఒంగోలు మెట్రో: నాగినేని మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక సీవీఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ ఆవరణలో ఇటీవల దివంగతులైన ప్రముఖ సినీ నటులు కోట శ్రీనివాసరావు, బీ సరోజా దేవిల సంస్మరణ సభ నిర్వహించారు. తొలుత కోట, సరోజాదేవి చిత్రపటాలకు పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు మిడసల మల్లికార్జునరావు మాట్లాడుతూ దక్షిణ భారత చలన చిత్ర రంగంలో తమదైన శైలిలో రాణించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలతో పాటుగా సినీ ప్రేక్షకుల హృదయాల్లో ఎన్నటికీ చెరగని స్థానం పొందిన వీరు ధన్యులని అన్నారు. లలిత కళా అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ తన విలక్షణమైన నటనతో ప్రతి నాయకుడిగా సహాయ నటుడిగా, హాస్య నటుడుగా ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి ఆ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చే పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మరణం అత్యంత బాధాకరం అన్నారు. జిల్లా రంగ భూమి కళాకారుల సంఘం కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్ మాట్లాడుతూ తెలుగులో ఎన్టీఆర్, తమిళంలో ఎంజీఆర్, కన్నడంలో రాజ్ కుమార్ సరసన అనేక హిట్ చిత్రాల్లో నటించిన అలనాటి అందాల తార పద్మభూషణ్ బీ సరోజా దేవి మరణం సినీ ప్రేక్షకుల హృదయాల్లో విషాదం నింపిందని అన్నారు. కార్యక్రమంలో విశ్రాంత అటవీ శాఖ అధికారి గుంటూరు సత్యనారాయణ, పొదిలి బాల గురవయ్య, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.