
కూటమి కాటు
హైస్కూల్ ప్లస్‌పై
గ్రామీణ ప్రాంతాల్లో పదో తరగతిపూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్మీడియెట్ విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా హైస్కూళ్లను హైస్కూల్ ప్లస్‌గా గత ప్రభుత్వంలో మార్పు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైస్కూల్ ప్లస్ కళాశాలల్లో అధ్యాపకులు, మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇంటర్మీడియెట్ కోర్సుల్లో విద్యార్థులు చేరేందుకు వెనకాడుతున్నారు. అడ్మిషన్లు లేక కాలేజీలు వెలవెలబోతుంటే ఏం చేయాలో పాలుపోక ప్రిన్సిపాళ్లు తలపట్టుకుంటున్నారు.
లెక్చరర్ల కొరత ఉంది
పైస్కూల్ ప్లస్‌లో లెక్చరర్ల కొరత ఉంది. దీనిపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లాం. అధ్యాపకుల నియామకం, అర్హులైన ఉపాధ్యాయుల డిప్యుటేషన్, వర్క్ అడ్జెస్ట్‌మెంట్‌పై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. ఆదేశాలు వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం.
– సీహెచ్ రమణారెడ్డి,
ఎంఈఓ, బేస్తవారిపేట
హైస్కూల్ ప్లస్‌లను
నిర్వీర్యం చేయడం తగదు
దూర ప్రాంతాలకు వెళ్లి ఇంటర్ విద్యను అభ్యసించలేని పేద విద్యార్థుల కోసం ఏర్పా టు చేసిన హైస్కూల్ ప్లస్‌లను నిర్వీర్యం చేయడం తగదు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఉన్న హైస్కూల్ ప్లస్ వ్యవస్థను పటిష్టం చేసి కొనసాగించాలి. అర్హులైన స్కూల్ అసిస్టెంట్‌లకు జూనియర్ లెక్చరర్ హోదా కల్పించి ఇంటర్ తరగతులు నిర్వహించాలి.
– యు.జోసఫ్, నియోజకవర్గ సీపీఐ సహాయ కార్యదర్శి
బేస్తవారిపేట: గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు, బలహీన వర్గాలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జాతీయ విద్యా విధానంలో భాగంగా 2022లో అప్పటి ప్రభుత్వం హైస్కూల్ ప్లస్‌లను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లోని బాలికలు, పేద విద్యార్థులు ఇంటర్ విద్యకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలు హైస్కూళ్లను హైస్కూల్ ప్లస్‌లుగా మార్పు చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. 6 నుంచి 12వ తరగతి వరకు విద్యా బోధన అందించేందుకు అర్హత ఉన్న స్కూల్ అసిస్టెంట్లకు డిప్లాయ్‌మెంట్ ద్వారా హైస్కూల్ ప్లస్‌లలో నియమించుకుని విద్యా బోధనకు శ్రీకారం చుట్టారు. అయితే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్లస్‌టూ కళాశాలల్లో అడ్మిషన్లు లేక వెలవెలబోతున్నాయి. సరైన వసతులు కల్పించక, అధ్యాపకులను నియమించకపోవడంతో ఈ దుస్థితి నెలకొన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వసతులు, అధ్యాపకులు లేక..
ఒక్కో హైస్కూల్ ప్లస్‌లో అందుబాటులో ఉన్న ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో ఒక్కో గ్రూపునకు 53 మంది చొప్పున 159 సీట్లు అందుబాటులో ఉన్నా యి. జిల్లాలో 21 ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియెట్ కోర్సులను ప్రారంభించారు. దీనికి వసతుల లేమి, అధ్యాపకుల కొరత ప్రధాన సమస్యలుగా ఉండటంతో అడ్మిషన్లు కావడంలేదు. ఈ హైస్కూల్ ప్లస్‌లలో ఒక్కో స్కూల్‌కు దాదాపుగా ఏడుగురు టీచర్లు ఉండాలి. అయితే కొన్నింట్లో టీచర్లు ఉంటే విద్యార్థులు లేకపోవడం, విద్యార్థులుంటే టీచర్లు లేకపోవడం వంటి సమస్యలను విద్యాశాఖ పరిష్కరించకపోవడంతో ఆ ప్రభావం అడ్మిషన్లపై పడుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యార్థులకు జీవశాస్త్రం, భౌతిక, రసాయన శాస్త్రాలకు సంబంధించి తరగతి గదులు, ల్యాబ్‌లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. పూర్తి స్థాయిలో అధ్యాపకులను నియమించి, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
విద్యార్థుల భవిష్యత్‌పై
కొరవడిన ఆలోచన
కళాశాలలు తెరచి నెలన్నర అవుతున్నా ఇంటర్ విద్యార్థుల భవిష్యత్ గురించి విద్యాశాఖ ఆలోచించలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్లస్‌టూ కొనసాగిస్తారా లేదా అనే సమాచారం కూడా ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులకు ఏం చెప్పాలో అర్థంకాక ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు తలలు పట్టుకుంటున్నారు. బేస్తవారిపేట, ముండ్లపాడు కళాశాలలో ఒక్క ఉపాధ్యాయుడు లేకపోవడంతో కొత్త అడ్మిషన్లు ఒక్కటీ కాలేదు. సీనియర్ ఇంటర్ విద్యార్థులను సమీపంలోని కంభం, గిద్దలూరులోని ప్లస్‌టూ కళాశాలలకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.
రిలీవైన టెన్త్ విద్యార్థులు..
వాస్తవానికి ఇక్కడ చదివిన టెన్త్ పాసైన విద్యార్థులను ఇంటర్మీడియెట్‌కు ప్రమోట్ చేయాల్సి ఉంది. కళాశాలలో సరైన వసతులు లేకపోవడం, ల్యాబ్ ఏర్పాటు చేయకపోవడం, ఉపాధ్యాయుల కొరత ఉంది. ఇక్కడ చదువుతున్న ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థుల ఇబ్బందులు గమనించిన టెన్త్ పూర్తయిన విద్యార్థులు అక్కడ ప్లస్‌టూలో చేరేందుకు సుముఖత చూపడంలేదు.
కూటమి ప్రభుత్వం వచ్చాకహైస్కూల్ ప్లస్ కళాశాలలపై నిర్లక్ష్యం పాఠాలు చెప్పేందుకు అధ్యాపకులు కరువు వసతులు లేక చేరేందుకు విద్యార్థుల వెనకడుగు టీసీలు తీసుకుని వెళ్తున్న సీనియర్ ఇంటర్ విద్యార్థులు తలలు పట్టుకుంటున్న ప్రిన్సిపాళ్లు జిల్లాలో 21 హైస్కూల్‌ప్లస్ కళాశాలలు
ఉదాహరణకు గిద్దలూరు నియోజకవర్గంలో బేస్తవారిపేట జెడ్పీ బాలుర హైస్కూల్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 17 మంది ఉండగా మొదటి సంవత్సరంలో ఒక్కరు కూడా చేరలేదు. బోధనకు ఉపాధ్యాయులు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. విద్యార్థులకు కంభం జూనియర్ కళాశాలలో తరగతులు చెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే గిద్దలూరు జెడ్పీ బాలుర హైస్కూల్‌లో అధ్యాపకుల కొరత ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు 51 మంది ఉన్నారు. గిద్దలూరు మండలంలోని ముండ్లపాడు హైస్కూల్‌లో ఉపాధ్యాయులు లేకపోవడంతో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 31 మంది ఉండగా 16 మంది టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. మొదటి సంవత్సరంలో ఒక విద్యార్థి చేరారు. గిద్దలూరులోని జెడ్పీ బాలురలోని ప్లస్‌టూ కళాశాలలో తరగతులు చెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఏడాది అసలు పట్టించుకోలేదు..
2022లో 10 ఉన్నత పాఠశాలలు, 2024లో మరో 11 ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియెట్‌ను ప్రారంభించారు. ఇంటర్ తరగతులు చెప్పే ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్ ఇస్తామనడంతో ఉపాధ్యాయులు చేరారు. 2024–25 ఎన్నికల సమయం కావడంతో పూర్తి స్థాయిలో దీనిపై దృష్టిపెట్టలేదు. అప్పట్లో వర్క్ అడ్జెస్ట్‌మెంట్ కింద, డిప్యుటేషన్‌లపై పీజీ చేసిన ఉపాధ్యాయులతో ఇంటర్ తరగతులు చెప్పించారు.
2025–26లో వర్క్ అడ్జెస్ట్‌మెంట్‌పై కానీ, డిప్యుటేషన్‌లపై కానీ అర్హులైన ఉపాధ్యాయులను నియమించలేదు.

కూటమి కాటు