
జేబు గుల్ల!
తక్కువ ధరకు విక్రయించాల్సిన జనరిక్ మందులను ఎమ్మార్పీ రేట్లకే విక్రయిస్తూ ప్రజలను దోచేస్తున్నారు. 80 శాతం తక్కువకు అందించాల్సిన వీటిని ఎమ్మార్పీ రేట్లకు అమ్ముతూ జనం జేబులు గుల్ల చేస్తున్నారు. ఏది జనరిక్ మందో తెలియక మందుల దుకాణాల మాయాజాలంతో ప్రజలు మోసపోతున్నారు. గుర్తింపునిచ్చిన జనరిక్ దుకాణాల్లో రూ.30కి విక్రయించే మందును పెద్ద పెద్ద మెడికల్ షాపుల్లో రూ.150కి విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఔషధ దుకాణాల్లో అడ్డగోలు దోపిడీని అరికట్టాల్సిన డ్రగ్ కంట్రోల్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
● నిరుపేద, సామాన్య ప్రజల జేబులు గుల్ల చేస్తున్న వైనం ● జిల్లాలో 88 జనరిక్ మందుల దుకాణాలు ● ఒక్క ఒంగోలు నగరంలోనే ఏడాదికి రూ.100 కోట్ల వ్యాపారం ● 20 శాతం రాయితీ పేరుతో మెడికల్ షాపుల దోపిడీ ● ఆరోగ్య శ్రీ రోగులకు జనరిక్ మందులు కట్టబెడుతున్న కార్పొరేట్ ఆస్పత్రులు ● ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఇదే తంతు ● ఔషధ నియంత్రణ శాఖనే నియంత్రిస్తున్న మెడికల్ వ్యాపారులు ● బదిలీపై వెళ్లిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌కు భారీ నజరానా
మందుబిళ్ల..
మెడికల్ షాపుల్లో జనరిక్ మాయాజాలం
ఒంగోలు టౌన్:
జిల్లా కేంద్రమైన ఒంగోలులో జనరిక్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఔషధ నియంత్రణ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 88 జనరిక్ మెడికల్ షాపులు ఉన్నాయి. ఇందులో 34 హోల్‌సేల్ దుకాణాలుండగా 54 రిటైల్ దుకాణాలున్నాయి. ఒక్క ఒంగోలు నగరంలోనే 21 జనరిక్ హోల్సేల్ దుకాణాలున్నాయి. మార్కాపురంలో 13 జనరిక్ హోల్సేల్ దుకాణాలున్నాయి. నగరంలోని దిబ్బల రోడ్డులోని ఓ షాపులో ఏడాదికి 50 కోట్ల రూపాయలకుపైగానే బిజినెస్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతిరోజూ ఈ హోల్‌సేల్ షాపునకు కనీసం 5 నుంచి 10 లారీల సరుకు వస్తుందని, అంతే మొత్తంలో ఇక్కడి నుంచి సరుకు బయటకు వెళ్తోందని సమాచారం. ఒంగోలు నగరంలోనే ఏడాదికి రూ.100 కోట్ల జనరిక్ మెడిసిన్ వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
20 శాతం రాయితీ ఒట్టిమాయ...
జిల్లా కేంద్రమైన ఒంగోలులో 530 మెడికల్ షాపులు ఉన్నాయి. సుమారు 250కిపైగా హోల్‌సేల్ షాపులు ఉన్నాయి. కొన్ని మెడికల్ షాపులలో 20 శాతం రాయితీ ఇస్తుంటారు. సహజంగా మెడికల్ షాపుల్లో వినియోగదారులు ఎవ్వరూ బేరాలు చేయరు. అలాంటిది ఏకంగా 20 శాతం రాయితీతో మందులు విక్రయిస్తుండడంతో ప్రజలు ఆయా మెడికల్ షాపులకు క్యూ కడుతున్నారు. వాస్తవానికి ఈ 20 శాతం రాయితీ పెద్ద మాయ అని కొందరు ఫార్మాసిస్టులు చెబుతున్నారు. 20 శాతం రాయితీ పేరుతో మందులు విక్రయిస్తున్న చైన్ మెడికల్ షాపులలో 75 శాతానికి పైగా జనరిక్ మందులను అమ్ముతున్నట్లు సమాచారం. నిజానికి జనరిక్ మందులను వాటిపై ఉన్న ఎమ్మార్పీ ధర కంటే 80 శాతం తక్కువకు విక్రయించాల్సి ఉంటుంది. బయట మార్కెట్లో జనరిక్ మెడికల్ షాపులలో అలాగే తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు కూడా. కానీ, అందుకు భిన్నంగా కొందరు మెడికల్ షాపుల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతూ రెండు చేతులా సంపాదిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనరిక్ మందులను బ్రాండెడ్ పేరుతో విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.

జేబు గుల్ల!