
ఆరోగ్య శ్రీ రోగులకు జనరిక్ మందులు...
నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్నారు. ఎక్కువగా గుండె జబ్బులు, పక్షవాతం వంటి జబ్బులకు వైద్య సేవలు అందిస్తున్న కార్పొరేట్ ఆస్పత్రుల్లో జనరిక్ మందులిచ్చి ఎమ్మార్పీకి బిల్లులు చేసుకుంటున్నట్లు సమాచారం. గుండె జబ్బుతో బాధపడుతున్న వ్యక్తికి గుండె కవాటాల్లో రక్తం గడ్డకట్టకుండా టికాగ్రేలార్ 90 ఎంజీ మందును డాక్టర్ రాశారు. దానిమీద ఎమ్మార్పీ రూ.359 రూపాయలు ఉంది. నిజానికి ఇది జనరిక్ ఔషధం. బహిరంగ మార్కెట్లో దీన్ని కేవలం 60 నుంచి 75 రూపాయలకు మాత్రమే విక్రయించాలి. కానీ, సదరు కార్పొరేట్ ఆస్పత్రిలో దీనికి ఎమ్మార్పీ బిల్లు ఇవ్వడం గమనార్హం. అలాగే కొలెస్టరాల్‌ను నియంత్రించే రోసువాస్టాటిన్ 40 ఎంజీ మందుపై ఎమ్మార్పీ రూ.584 ఉంది. దీనిని కూడా ఎమ్మార్పీకే ఇస్తున్నారు. నిజానికి ఈ మందు జనరిక్ మెడికల్ షాపులలో కేవలం రూ.80కే లభిస్తుంది. లివోసిట్రిజన్ ట్యాబెట్ల మీద ఎమ్మార్పీ రూ.99.55 ఉండగా, ఇది జనరిక్ మెడికల్ షాపులో కేవలం రూ.6కే లభిస్తుంది. ఇదే పెద్ద మెడికల్ షాపులలో ఎమ్మార్పీ మీద 20 శాతం ఇచ్చి రోగుల చెవిలో పూలు పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. గ్యాస్ ట్రబుల్‌కు వాడే ర్యాబిప్రజోల్, పాంటా ప్రజోల్ ట్యాబ్లెట్ల మీద కూడా ఇదే తరహాలో బాదేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఔషధ నియంత్రణ శాఖ, ఆరోగ్యశ్రీ అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక్కోక్క షీటు మీద పదింతలు అధిక రేటుకు విక్రయిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.