ఒంగోలు సబర్బన్: లెక్చరర్ పోస్టులు భర్తీ చేసేందుకు ఏపీపీఎస్‌సీ ఆధ్వర్యంలో జిల్లాలో పటిష్ట భద్రత మధ్య పరీక్షలు జరుగుతున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు తెలిపారు. ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకూ ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా జిల్లావ్యాప్తంగా ఆరు సెంటర్లలో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మూడో రోజైన గురువారం ఒంగోలు నగరం మామిడిపాలెంలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ ది చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా కాలేజీలో మాత్రమే పరీక్షలు జరిగాయన్నారు. పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన డీఆర్వో.. అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఏపీపీఎస్‌సీ నిబంధనల మేరకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఉదయం పరీక్షకు 49 మందికిగానూ 29 మంది, మధ్యాహ్నం పరీక్షకు 77 మందికిగానూ 35 మంది హాజరయ్యారని డీఆర్‌ఓ వివరించారు.
డీఈఈ సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం
ఒంగోలు సిటీ: డీఈఈ సెట్ కౌన్సెలింగ్‌ను ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ, మైనంపాడులో ప్రిన్సిపాల్ సామా సుబ్బారావు ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించారు. ప్రభుత్వం సూచించిన మేరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలకు రెండు టీంలు ఏర్పాటు చేశారు. ఆయా టీంల ద్వారా అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు వెరిఫై చేశారు. ప్రొవిజినల్ అడ్మిషన్ లెటర్‌తో వచ్చిన అభ్యర్థికి అన్ని సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాత ఫైనల్ అడ్మిషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుందని సుబ్బారావు తెలిపారు. జిల్లాలో డైట్‌తో పాటు దర్శి, కనిగిరి రెండు ప్రైవేట్ డైట్ కళాశాలలకు మైనంపాడు డైట్‌లోనే వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. ఈ నెల 22వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనుండగా, తొలిరోజు నలుగురు అభ్యర్థులకు సీట్లు కేటాయించారు.