వెలిగొండను నిర్వీర్యం చేస్తున్న కూటమి | - | Sakshi
Sakshi News home page

వెలిగొండను నిర్వీర్యం చేస్తున్న కూటమి

Jul 18 2025 5:06 AM | Updated on Jul 18 2025 5:06 AM

వెలిగొండను నిర్వీర్యం చేస్తున్న కూటమి

వెలిగొండను నిర్వీర్యం చేస్తున్న కూటమి

పెద్దదోర్నాల: రాష్ట్రంలోని కూటమి సర్కార్‌ వెలిగొండ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తోందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. మేక్‌ ఆంధ్ర గ్రేట్‌ ఎగైన్‌ విత్‌ జగనన్న కార్యక్రమంలో భాగంగా గురువారం పెద్దదోర్నాల మండలంలో ఆమె పర్యటించారు. వెలిగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ పనులను పరిశీలించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత వాసుల కడగండ్లను గమనించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ ప్రాంత ప్రజల కష్టాలు గట్టెక్కాలన్న ఉద్దేశంతో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారన్నారు. ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా అతి పొడవైన సొరంగాల నిర్మాణాలతో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారన్నారు. కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 4 లక్షల 47 వేల 300 ఎకరాలకు సాగు నీరు, ఆయా జిల్లాల పరిధిలోని 30 మండలాల్లో లక్షలాది మందికి తాగునీరు అందించేలా ప్రాజెక్టు రూపుదిద్దుకుందన్నారు. ప్రాజెక్టులో భాగంగా సుంకేసుల నుంచి తీగలేరు కెనాల్‌కు నీరు తరలించడం ద్వారా యర్రగొండపాలెం నియోజకవర్గంలో 62 వేల ఎకరాల బీడు భూములు సాగులోకి వస్తాయన్నారు. ఇంత గొప్ప ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. పనులు కూడా నత్తనడకన జరుగుతుండటంతో పనులు చేసే సిబ్బందిని సైతం ఇక్కడి నుంచి పంపించే చర్యలు జరుగుతున్నాయని అన్నారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యం వీడి ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని ఆమె కోరారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆమె ఆకాక్షించారు.

సూపర్‌ స్పెషాలిటీ పూర్తయితే గిరిజనులకు మెరుగైన వైద్యం...

చెంచు గిరిజనుల అభ్యున్నతికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన హయాంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. చిన్న రోగాలకే ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనుల కోసం నాటి జగన్‌ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వారి కోసం మండల కేంద్రంలోని ఐనముక్కల వద్ద 50 కోట్ల రూపాయలతో గిరిజన సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాల నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రాజకీయాలకు అతీతంగా కూటమి ప్రభుత్వం వైద్యశాల పనులను వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో పాటు గిరిజనుల కోసం యర్రగొండపాలెంలో రూ.26 కోట్లతో 100 పడకల వైద్యశాల, పెద్దదోర్నాలలో రూ.3 కోట్లతో మాతాశిశు ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు జరిగాయన్నారు. దీని వలన నల్లమల పరిధిలోని చెంచు గిరిజనులకు మెరుగైన వైద్యం అందబోతోందని ఆమె అన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అటవీ హక్కుల చట్టం ఏర్పాటు చేసి గిరిజనులు సాగు చేసుకునే భూములపై వారికే హక్కు కల్పించారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ పెద్దదోర్నాల మండల కన్వీనర్‌ గంటా వెంకట రమణారెడ్డి, మండల నాయకులు లాలూనాయక్‌, యక్కంటి లింగారెడ్డి, బీసీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మా యల్లేష్‌, నియోజకవర్గ నాయకులు షేక్‌ షెక్షావలి, మాండ్ల వెంకటేశ్వర్లు, అల్లు రాంభూపాల్‌రెడ్డి, చిట్యాల వెంకటేశ్వరరెడ్డి, షేక్‌ జబ్బార్‌, అల్లు రమణారెడ్డి, ఎంపీటీసీ నాగమల్లేశ్వరి, దొందేటి కృష్ణారెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement