బస్తా మే సవాల్‌..! | - | Sakshi
Sakshi News home page

బస్తా మే సవాల్‌..!

Jul 17 2025 3:14 AM | Updated on Jul 17 2025 3:14 AM

బస్తా మే సవాల్‌..!

బస్తా మే సవాల్‌..!

రేషన్‌ మాఫియా..

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం జిల్లాలో కొత్తపుంతలు తొక్కుతోంది. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15 వరకు రేషన్‌ దుకాణాల ద్వారా సరఫరా చేసే బియ్యాన్ని కార్డుదారులకు అరకొరగా పంపిణీ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 1392 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. 6,37,820 తెల్లకార్డులు ఉండగా, అంత్యోదయ అన్న యోజన కార్డులు 32,807 ఉన్నాయి. ఈ రేషన్‌ దుకాణాలన్నీ కూటమి పార్టీల నాయకులకు చెందిన డీలర్ల నిర్వహణలో ఉన్నాయి. దీంతో ఎక్కడికక్కడ రేషన్‌ దుకాణాలను సిండికేట్‌ చేసి అక్రమంగా బియ్యాన్ని తరలించి జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. జిల్లాకు ప్రతి నెలా 10,582 మెట్రిక్‌ టన్నుల బియ్యం వస్తోంది. ఇందులోంచి 50 శాతానికి పైగా బియ్యాన్ని తరలించాలని అధికార పార్టీ నాయకులు డీలర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అంటే నెలకు సుమారుగా 5 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం తరలిపోతుందన్నమాట. ఇందులో కిలోకు 5 రూపాయలు చొప్పున ఆయా నియోజకవర్గాలకు చెందిన అధికార పార్టీ కీలక నేతలకు ఇచ్చేలా మాఫియా మధ్య ఒప్పందం జరిగినట్లు ప్రచారం సాగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ కీలక నేతలకు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ ముడుపులు చెల్లించాల్సి ఉంటుందని ఆరోపణలున్నాయి. అలాగే అధికారులకు కూడా ఎవరికి ముట్టచెప్పాల్సింది వారికి ముట్టచెబుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఒక అధికారికి నెలకు రూ.8 లక్షల వరకు రేషన్‌ మాఫియా ద్వారా కమీషన్లు ముడుతున్నట్లు ప్రచారం.

పట్టుబడింది 3 వేల బస్తాలైతే

750 బస్తాలకే కేసు...

దర్శి నియోజకవర్గంలోని ఒక రైస్‌ మిల్లులో రెండు రోజుల క్రితం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 3 వేల (25 కేజీలు) బస్తాల బియ్యం దొరికినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారం తెలిసిన వెంటనే టీడీపీ కీలక నాయకురాలు రంగంలోకి దిగినట్లు చెప్పుకుంటున్నారు. పైస్థాయి నుంచి తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. దాంతో కేవలం 750 బస్తాల బియ్యం మాత్రమే దొరికినట్లు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. మిగిలిన బియ్యాన్ని అక్కడే వదిలివెళ్లి పోయారని, ఆ బియ్యాన్ని రాత్రికి రాత్రే ఒంగోలుకు తరలించినట్లు సమాచారం. భారీ మొత్తంలో రేషన్‌ బియ్యం దొరకడంతో దర్శి నియోజకవర్గ ప్రజలు విస్తుపోయారు.

చక్రం తిప్పుతున్నది వీళ్లే..

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో కీలకనేతల అనుచరులు, పీఏలు, సోదరులు ఇతర కుటుంబ సభ్యులు పర్యవేక్షిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. యర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జికి సన్నిహితుడిగా మెలిగే ఒక నాయకుడు గతంలో పోలీసులతో ఘర్షణకు దిగడం సంచలనం సృష్టించింది. పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు వద్ద దొరికిన రేషన్‌ బియ్యం వ్యవహారంలో సదరు అనుచర నాయకుడు పోలీసులపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారు. ఒంగోలులో కీలక నేత వద్ద ఉన్న ఏడుగురు పీఏలలో ఒకరికి రేషన్‌ బియ్యం వ్యవహారాన్ని అప్పగించినట్లు సమాచారం. గిద్దలూరులో అన్నీ వ్యవహారాలను చక్కదిద్దుతున్న కీలక నేత సోదరుడు రేషన్‌ అక్రమ రవాణాను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కొండపిలో టీడీపీ నాయకుడి తండ్రి కనుసన్నల్లో ఈ వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. కనిగిరి రేషన్‌ వ్యాపారాన్ని ఒంగోలు జనసేన నేత చూసుకుంటున్నట్లు చెబుతున్నారు. చీరాలలో రేషన్‌ బియ్యాన్ని ఒంగోలు టీడీపీ కార్పొరేటర్లు ఇద్దరు నిర్వహిస్తున్నారని సమాచారం. దర్శిలో 10 మంది కూటమి నాయకులను రేషన్‌ బియ్యం రవాణాకు కేటాయించినట్లు చెప్పుకుంటున్నారు.

జిల్లా కేంద్రంగా రేషన్‌ మాఫియా...

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్‌ బియ్యం వ్యాపారానికి జిల్లా.. కేంద్రంగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక మంత్రికి అత్యంత సన్నిహితుడిగా మెలిగే ఒక కార్పొరేషన్‌ చైర్మన్‌ బియ్యం వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని 8 నియోజకవర్గాలతో పాటుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, చీరాల రేషన్‌ బియ్యాన్ని సైతం జిల్లా నాయకులే కొనుగోలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దాంతో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ఒక అవగాహన కుదుర్చుకున్న సదరు నాయకుడు జిల్లా కేంద్రంలో రెండు రైస్‌ మిల్లుల ద్వారా బియ్యం వ్యాపారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. పశ్చిమ ప్రకాశం నుంచి వచ్చే బియ్యాన్ని కర్నూలు రోడ్డులోని పీర్లమాన్యంలో ఒక రైస్‌ మిల్లుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. తూర్పు జిల్లా నుంచి వచ్చే బియ్యాన్ని తీరప్రాంతం నుంచి తరలించి ఈతముక్కల గ్రామంలోని ఒక రైస్‌ మిల్లులో నిల్వ చేసి అక్కడ నుంచి కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు తరలిస్తున్నట్లు సమాచారం.

జిల్లాలో పేదల బియ్యం అక్రమ రవాణాకు అడ్డే లేకుండా పోతోంది. అధికార టీడీపీ ప్రజా ప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉండడంతో రేషన్‌ మాఫియా రెచ్చిపోతోంది. రాత్రుళ్లు గుట్టుచప్పుడు కాకుండా పోర్టుల ద్వారా రేషన్‌ బియ్యాన్ని ఎల్లలు దాటించేస్తోంది. నిరుపేద ప్రజల కడుపులు నింపాల్సిన రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా అమ్ముకుంటూ బడా బాబులు బొజ్జలు నింపుకుంటున్నారు. బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన పౌరసరఫరాల శాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల కిందట దర్శిలో ఒక రైస్‌ మిల్లుపై అధికారులు దాడులు చేసి అక్కడ సుమారు 3 వేల బస్తాలు ఉంటే కేవలం 706 బస్తాలకే కేసు నమోదు చేసినట్టు సమాచారం.

టీడీపీ కనుసన్నల్లో యథేచ్ఛగా రేషన్‌ బియ్యం వ్యాపారం కీలక మంత్రికి సన్నిహితుడి గుప్పిట్లో జిల్లా రేషన్‌ మాఫియా రాత్రికి రాత్రే కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు తరలింపు పాలకుల అండతో మిన్నకుండిపోతున్న అధికారులు దర్శిలో అధికారుల తనిఖీల్లో భారీగా రేషన్‌ బియ్యం పట్టివేత మిల్లులో ఉన్న బస్తాలు 3 వేలు.. కేసు నమోదు 706 బస్తాలే అధికారులపై ఉన్నత స్థాయి ఒత్తిళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement