
మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి
● ఒంగోలులో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు మొదటి రోజు సమ్మె
ఒంగోలు సబర్బన్: షరతులు లేకుండా మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని మున్సిపల్ కార్మికుల సంఘ జిల్లా గౌరవ అధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒంగోలు నగర మున్సిపల్ పారిశుధ్య కార్మికులు బుధవారం మొదటి రోజు సమ్మె నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి అద్దంకి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కొర్నెపాటి శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వయోపరిమితి 62 ఏళ్లకు పెంచాలని, కోవిడ్ కార్మికులను ఆప్కాస్‌లోకి తీసుకోవాలని, గత 17 రోజులు సమ్మె కాల ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలని కోరారు. చనిపోయినా, ఆరోగ్యం బాగాలేని కార్మికులకు వాళ్ల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆప్కాస్‌లో ఎంప్లాయ్ కోడ్ లింకును తీసివేయాలన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు సేవ చేసే మున్సిపల్ కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయిస్తూ పట్టించుకోకపోవటం దారుణమన్నారు. సీఐటీయూ నగర కార్యదర్శి టి.మహేష్ మాట్లాడుతూ చనిపోయినా, ఆరోగ్యం బాగాలేని కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఖాళీ అయిన స్థానాల్లో టీడీపీ కార్యకర్తలను ఆప్కాస్‌లో చేర్పిస్తున్నారని ధ్వజమెత్తారు. ఖాళీ పోస్టుల స్థానంలో కోవిడ్ కార్మికులను ఆప్కాస్ లోకి తీసుకోవాలని, లేకుంటే ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో వై రవి, ఏం బాబు, ఆర్ శ్రీనివాసరావు, బి బాబు, కే వెంకటేశ్వర్లు, కే యాకోబు, యూనియన్ నగర కార్యదర్శి విజయమ్మ, అనిత, బందెల సుబ్బారావు, కసుకుర్తి వెంకటేశ్వర్లు, ఆనంద్, కే మోహన్‌రావు, ఆర్ రాములు, కే సామ్రాజ్యం, పి పద్మ, కమల, కే వంశీతో పాటు తదితరులు పాల్గొన్నారు.