
కార్మికుల సమస్యలు పాలకులకు పట్టవా..
● ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయం ముందు ఇంజినీరింగ్ సిబ్బంది ధర్నా
ఒంగోలు సబర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన కార్మికులు సమ్మె చేస్తున్నా పాలకులకు ఏ మాత్రం పట్టడం లేదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు ధ్యజమెత్తారు. స్థానిక ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమ్మె కొనసాగింపులో నిరసన కార్యక్రమాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల నుంచి మున్సిపాలిటీ ఇంజినీరింగ్ కార్మికులు సమ్మె చేస్తున్నారన్నారు. యూనియన్ నాయకత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు కూడా పిలవకుండా పక్కదారులు పట్టించే పద్ధతిలో ఉందని మండిపడ్డారు. ఇంజినీరింగ్ కార్మికులకు స్కిల్ ప్రకారం వేతనాలు చెల్లించకుండా అందరికీ ఒకే తరహా వేతనాలు చెల్లించటం మోసగించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కార్మికుల పక్షాన లేకుండా, వేతనాల పెంచకుండా సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం మున్సిపల్ అధికారులతో పోటీ కార్మికులతో పని చేయించుకునే పద్ధతిలో ఉండటం అత్యంత దారుణమని ధ్వజమెత్తారు.
ఆర్టీసీ ఎస్‌టీడబ్ల్యూఎఫ్ ఒంగోలు బ్రాంచ్ ఒంగోలు డిపో కమిటీ కార్మికులకు ఇంజినీరింగ్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎం.హైపురెడ్డి మాట్లాడుతూ కార్మికులకు కనీసం వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. చట్టాలు అమలు చేయడంలో కార్మికుల పక్షాన నిలవాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ ఒంగోలు నగర కార్యదర్శి మహేష్, ఉపాధ్యక్షులు తంబి శ్రీనివాసులు, జీ రమేష్, యూనియన్ జిల్లా కార్యదర్శి కే శ్రీనివాసరావు, ఇంజినీర్ కార్మికులు, యూనియన్ నాయకులు కే జాలయ్య, కే వెంకటరావు, కే మోహన్ రావు, సుధాకర్, ప్రసన్న, శ్రీదేవి, శివమ్మ, వంకాయల ప్రతాప్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.