
ఒంగోలులో పుస్తక మహోత్సవం
ఒంగోలు సబర్బన్: విజయవాడ బుక్ ఫెస్టివల్స్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ, గ్రంథాలయ శాఖ సంయుక్తంగా ఆగస్టు 15 నుంచి 10 రోజుల పాటు మూడో పుస్తక మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మయ్య, మనోహర్ నాయుడు తెలిపారు. పుస్తక మహోత్సవానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను బుధవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి 24వ తేదీ వరకు పది రోజుల పాటు పుస్తక మహోత్సవాన్ని నగరంలోని పీవీఆర్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన ఉంటుందన్నారు. పుస్తక ప్రదర్శనలో ప్రముఖ పబ్లిషర్స్ వంద స్టాల్స్ వరకు ఏర్పాటు చేస్తారన్నారు. ప్రతిరోజూ సాయంత్రం సాహిత్య, సాంస్కృతిక వి/్ఞాన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పుస్తక మహోత్సవంలో సైన్స్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పుస్తక పఠనంపై మక్కువ పెంచాలనే ఉద్దేశంతో ఈ పుస్తక మహోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర కమిషనర్ కోడూరి వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు నాయక్, కార్యదర్శి ఆర్ రామకృష్ణ, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వేంకట శ్రీనివాసులు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి అలుగుల సురేష్, పాల్గొన్నారు.
ఆగస్టు 15వ తేదీ నుంచి 10 రోజుల పాటు
పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా