
బాబు మోసాలు బయటపెడదాం
సంతనూతలపాడు: ప్రతి ఎన్నికల్లో అసాధ్యమైన హామీలతో ప్రజలను మభ్యపెట్టి గెలిచాక వాటిని విస్మరించడం చంద్రబాబుకు అలవాటని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. పార్టీ మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూ ఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని చంద్రబాబు సక్రమంగా అమలు చేయలేదన్నారు. కానీ మన పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ప్రతి నెలా అర్హులకు నగదు జమైందన్నారు. 30 లక్షల ఇళ్లు, విద్య, ఆరోగ్య రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించారన్నారు. చంద్రబాబు పాలన అనుచరుల అభివృద్ధికే పరిమితమైందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్‌బుక్ రాజ్యాంగం అమల్లో ఉందన్నారు. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు వివరించి అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అధైర్యపడొద్దని, జగన్‌మోహన్‌రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమం ప్రజల గుండెల్లోనే ఉన్నాయన్నారు. 2029లో పార్టీ జెండా ఎగరవేస్తామన్నారు. చంద్రబాబు మోసాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
టీడీపీపై ప్రజల్లో తిరుగుబాటు
ఏడాది కాలంలోనే అధికార టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, త్వరలోనే తిరుగుబాటు తప్పదని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ అన్నారు. జగన్మోహన్‌రెడ్డి తన హయాంలో నిజాయితీ రాజకీయాలు చేశారని, అందుకే ప్రజల్లో ఆయన ప్రతిష్ట రోజు రోజుకు పెరుగుతుందన్నారు. ఈ సమయంలో కష్టపడే ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయన్నారు. జగన్ ప్రభంజనం మరోసారి చరిత్ర సృష్టిస్తుందన్నారు. సమావేశంలో మాజీ సొసైటీ ప్రెసిడెంట్ దుంపా యలమందారెడ్డి, సీనియర్ నాయకులు బొల్లిలేని కృష్ణయ్య, అబ్బూరి శంకరరావు, గోపిరెడ్డి ఓబుల్ రెడ్డి, మండల మహిళాధ్యక్షురాలు సీతమ్మ, మద్దిపాడు ఎంపీపీ వాకా అరుణా కోటిరెడ్డి, దమ్మల శ్రీనివాసరావు, ఏడుకొండలు, వైస్ ఎంపీపీ తన్నీరు రాగమ్మ, ఎంపీటీసీలు, సర్పంచులు దర్శి నాగమణి, శైలజ, వెంకటరెడ్డి, మున్సిపల్ విభాగం రావూరి శ్రీనివాస్రెడ్డి, బలరాంరెడ్డి, వెంకటనారాయణ, వెంకట్రెడ్డి, అమర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ శూన్యం
కార్యకర్తలు అధైర్యపడొద్దు..2029లో మళ్లీ జెండా ఎగరేస్తాం
మాజీ మంత్రి మేరుగు నాగార్జున