
సంక్షేమ పరవళ్లు!
అభివృద్ధికి బాటలు..
● వైఎస్సార్ హయాంలోనే శరవేగంగా వెలిగొండ నిర్మాణం ● గుండ్లకమ్మ, రామతీర్థంలకు జలసవ్వడులు ● రైతు రుణమాఫీతో అన్నదాతలకు అండగా నిలిచిన మహానేత ● వైఎస్సార్‌సీపీ పాలనలో పూర్తయిన వెలిగొండ ప్రాజెక్టు పనులు ● మార్కాపురంలో మెడికల్ కళాశాల పనులు వేగవంతం ● నేడు కూటమి పాలనలో అంతా తిరోగమనం
పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సాయం..
కరువు జిల్లాగా పేరొందిన జిల్లాకు వెలిగొండ వచ్చింది. గుండ్లకమ్మ పరుగులు పెట్టింది. రామతీర్థం జలకళతో
సవ్వడి చేసింది. రైతు మోముపై చిరునవ్వు తొణికిసలాడింది. జిల్లా కేంద్రం ఒంగోలుకు మెడికల్ కళాశాల వచ్చింది. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి వేసిన పునాదులు జిల్లా అభివృద్ధికి బాటలు వేశాయి. అప్పటిదాకా కరువు కాటకాలతో విలయతాండవం చేసిన జిల్లాలో ఆయన నడిచినంత మేరా పచ్చనిపైర్లు పలకరించాయి. ఆయన వారసుడిగా వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి స్ఫూర్తితో పాలన కొనసాగించారు. మార్కాపురంలో మెడికల్ కళాశాలకు శ్రీకారం చుట్టారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించారు. సంక్షేమ పథకాలు అమలు చేసి అన్ని వర్గాలకు
అండగా నిలిచారు. నేడు కూటమి పాలన అంతా తిరోగమనంలో సాగుతోంది. వెలిగొండపై నిర్లక్ష్యం..
మెడికల్ కళాశాల వెనక్కి..ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటీపై నీలి నీడలు.. ఇలా ఏడాది కాలంలో కూటమి పాలకులు జిల్లాకు చేసిన అన్యాయంపై జిల్లా వాసులు మండిపడుతున్నారు. నేడు వైఎస్సార్ జయంతి సందర్భంగా నాటి రాజన్న పాలనను జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద వైఎస్సార్ (ఫైల్)
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
జిల్లాలో కరువు విలయతాండవం చేస్తున్న సమయంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 4.477 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.20 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేసి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారు. శరవేగంగా పనులు సాగుతున్న సమయంలో ఆయన మరణంతో ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. 2014 నుంచి 2019 చంద్రబాబు పాలనలో వెలిగొండ దాదాపుగా మూలనపడింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎంగా జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. దాదాపుగా పనులన్నీ పూర్తి చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఎన్నికల కోడ్ వల్ల నిలిచిన అరకొర పనులు పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వానికి మనసురావడం లేదు. బడ్జెట్లలో కేవలం రూ.300 కోట్లు కేటాయించారంటే ఈ ప్రాజెక్టుపై వారి శ్రద్ధ అర్థం చేసుకోవచ్చని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి రూపాయి కూడా కేటాయించకుండా ప్రాజెక్టు పనులు పూర్తి కావడం అసాధ్యం.
పేదరికం కారణంగా ఏ ఒక్కరి చదువులు ఆగిపోకూడదంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రారంభించారు. లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులనభ్యసించారు. చంద్రబాబు పాలనలో ఆ పథకం నీరుగారడంతో పేద విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక తిరిగి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేయడం ద్వారా విద్యార్థులకు అండగా నిలిచారు. గత ఐదేళ్లలో 3,09,817 మంది విద్యార్థులకు విద్యా దీవెన, 2,72,315 మంది విద్యార్థులకు వసతి దీవెన ద్వారా కోట్ల రూపాయల సాయం అందించారు. మళ్లీ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాదిగా విద్యార్థులకు సాయం అందించకుండా వారి భవిష్యత్తుతో ఆటలాడుతోంది
వెలిగొండ ప్రాజెక్టు రెండు టన్నెళ్లు

సంక్షేమ పరవళ్లు!