
10న మెగా టీచర్–పేరెంట్ మీటింగ్
ఒంగోలు సబర్బన్: మెగా టీచర్ – పేరెంట్ మీటింగులను జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జ్ కలెక్టర్, జేసీ ఆర్.గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి నియోజకవర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల విద్యాశాఖాధికారులతో వర్చువల్‌గా సమీక్షించారు. ఈ నెల 10న జిల్లాలో జరగనున్న మెగా టీచర్–పేరెంట్ మీటింగ్ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందించడానికి విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధిని నిర్ధారించడానికి పాఠశాల విద్య, సమాజ భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగులను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోని మొత్తం 2,955 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, 188 జూనియర్ కళాశాలల్లో మీటింగులు నిర్వహించనున్నట్లు చెప్పారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని సూచించారు. అలాగే పూర్వ విద్యార్థులు, అక్కడ చదివి ఉన్నత స్థానాల్లో నిలిచిన వారిని కూడా ఆహ్వానించి సన్మానించాలని సూచించారు. కార్యక్రమానికి విద్యార్థులందరూ యూనిఫాంలో వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలలోని సృజనాత్మకతను వెలికితీసేలా పోటీలు నిర్వహించాలన్నారు. తల్లిదండ్రులకు కూడా పోటీలు నిర్వహించి బహుమతులు అందించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో కూడా మెగా పేరెంట్స్ మీట్ నిర్వహించేలా యాజమాన్యాలతో సమావేశం నిర్వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఈఓ కిరణ్‌కుమార్, ఆర్‌ఐఓ సైమన్ విక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్.శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మెగా టీచర్–పేరెంట్ మీటింగులపై ఇన్‌చార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ సమీక్ష అదే రోజు ప్రతి పాఠశాల, కళాశాలలో మొక్కలు నాటాలని ఆదేశం