
తండ్రిపై హత్యాయత్నం కేసులో కుమారుడికి రిమాండ్
టంగుటూరు: తండ్రిపై హత్యాయత్నం కేసులో నిందితుడైన కుమారుడికి రిమాండ్ విధించారు. ఈ కేసుకు సంబంధించి టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామానికి చెందిన దివి చందు కొంత కాలం నుంచి చెడు వ్యసనాలకు బానిసై ఇంట్లో తల్లిదండ్రులను డబ్బుల కోసం ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. దీనిపై జూన్ 12వ తేదీ అతని తల్లిదండ్రులు దివి వెంకటరావు, దివి లక్ష్మి ఫిర్యాదు చేశారు. డబ్బుల కోసం తమను చందు ఇబ్బందిపెడుతూ కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు అడిగినప్పుడల్లా డబ్బులివ్వకపోతే చంపుతానని బెదిరించినట్లు చెప్పారు. అతనికి భయపడి బంధువుల ఇంటి వద్ద ఉంటున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 3వ తేదీ పెన్షన్ కోసం ఆలకూరపాడు గ్రామానికి దివి వెంకటరావు, దివి లక్ష్మి రాగా, రాత్రి 8.45 గంటల సమయంలో ఇంటికొచ్చిన చందు.. తన తండ్రి దివి వెంకటరావుతో గొడవపడ్డాడు. అతన్ని చంపాలనే ఉద్దేశంతో కర్ర తీసుకుని తలపై కొట్టగా తీవ్రగాయమైంది. వెంటనే ఒంగోలు జీజీహెచ్‌కి స్థానికులు తరలించారు. క్షతగాత్రుడి భార్య దివి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె కుమారుడు దివి చందుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సోమవారం అతన్ని అరెస్టు చేసి సింగరాయకొండ కోర్టులో జడ్జి ముందు హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై వివరించారు.
ఏకేయూ కళాశాల నూతన ప్రిన్సిపాల్‌గా నిర్మలామణి
ఒంగోలు సిటీ: మూడేళ్ల క్రితం ఏర్పడిన ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ప్రొఫెసర్ ఎన్.నిర్మలామణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈమె ఇప్పటి వరకు వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఉంచిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడమే కాకుండా తన పదవీ కాలంలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ పదవికి వన్నె తెస్తానని అన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తానన్నారు. ఏకేయూ ఉప కులపతి, ప్రొఫెసర్ డీవీఆర్ మూర్తి సూచనల మేరకు ఏకేయూ కళాశాల ప్రిన్సిపాల్‌గా తనను నియమించిన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నూతన ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నిర్మలామణిని సహచరులైన ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఓఎస్డీ, పూర్వపు ఏకేయూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గుత్తి రాజమోహన్‌రావు, ఏకేయూ పరీక్షల నియంత్రణ అధికారి (సీఈ), ఏకేయూ వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.సోమశేఖర్‌తో పాటు ఆంధ్రకేసరి యూనివర్సిటీకి చెందిన బోధన, బోధనేతర సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు.
ఎమ్మార్పీఎస్ పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు బ్రహ్మయ్యమాదిగ
ఒంగోలు వన్‌టౌన్: ఎమ్మార్పీఎస్ 30 సంవత్సరాల అలుపెరుగని పోరాటం ద్వారానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు ఉసురుపాటి బ్రహ్మయ్యమాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరంలో సోమవారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక నెల్లూరు బస్టాండ్ సెంటర్‌లోని మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియంలో మాదిగ మహామేళా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్యమాదిగ మాట్లాడుతూ 30 సంవత్సరాల మాదిగల ఆశ, ఆకాంక్ష నెరవేరిందన్నారు. 1994 నుంచి 2024 వరకూ ఎస్సీ వర్గీకరణ పోరాటం జరిగిందన్నారు. 1994 జూలై 7వ తేదీ జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం ఈదుమూడిలో ఎస్సీ వర్గీకరణ కోసం 20 మందితో ఎమ్మార్పీఎస్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతరం ఎమ్మార్పీఎస్ మాదిగ దండోరా పేరుతో ఉద్యమాన్ని సాగించామన్నారు. పార్లమెంటులో చట్టం చేయాలనే డిమాండ్‌తో 2004 నుంచి 2023 వరకూ నిత్యం ఉద్యమం నిర్వహించామన్నారు. ఢిల్లీ వీధుల్లో కూడా వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం నిర్వహించామన్నారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

తండ్రిపై హత్యాయత్నం కేసులో కుమారుడికి రిమాండ్