
పట్టపగలే ఇంట్లో చోరీ
టంగుటూరు: పట్టపగలే ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీచేసిన సంఘటన శుక్రవారం జరగ్గా, సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టంగుటూరు మండలంలోని జయవరం గ్రామంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఇత్తడి వినోద్‌కుమార్ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. అతని భార్య అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. ఈ నెల 4వ తేదీ పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లారు. తిరిగి సాయంత్రం వచ్చి చూడగా, ఇంటి తాళం పగలకొట్టి ఉంది. ఇంట్లో పరిశీలించగా దుస్తులు, వస్తువులు చల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువా పగలకొట్టి అందులోని రూ.92 వేల నగదు, మూడు సవర్ల బంగారు నల్లపూసల దండ, ఉంగరం, చెయిన్‌ను చోరీ చేశారు. దీనిపై పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయగా, క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగమల్లీశ్వరరావు తెలిపారు.