ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలోని మామిడిపాలెం ఎస్‌ఎస్ ట్యాంక్–1 కట్టపై వాకర్స్ కోసం మంచినీటి సదుపాయం కల్పించాలని కోరుతూ ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రతినిధులు జాయింట్ కలెక్టర్, జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్‌లోని మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో జేసీని కలిసి విజ్ఞప్తి చేశారు. వాకర్స్‌కు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తే ఎంతోమందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఎస్‌ఎస్ ట్యాంకుపై మంచినీటి సదుపాయం కోసం జూన్ 23, 2025న ఒకసారి, జూన్ 30, 2025 మరోసారి జిల్లా కలెక్టర్‌కు మీ కోసం కార్యక్రమంలో అర్జీ సమర్పించామని చెప్పారు. ఎస్‌ఎస్ ట్యాంక్ కట్ట మీద నాలుగు చోట్ల షెడ్లు, బెంచీలు, టాయిలెట్లు కూడా ఏర్పాటు చేయాలని విన్నవించారు. సమస్య పరిష్కారానికి త్వరలో చర్యలు చేపడతామని జేసీ హామీ ఇచ్చారు.
నిర్దేశించిన సమయంలో సమస్యలు పరిష్కరించాలి...
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను నిర్దేశించిన సమయంలోగా శాశ్వతంగా పరిష్కరించాలని జేసీ, ఇన్‌చార్జ్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. డీఆర్వో చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, శ్రీధర్, జాన్సన్, పార్థసారధి, విజయజ్యోతితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక వ్యవస్థ ద్వారా అందిన దరఖాస్తులకు మెరుగైన పరిష్కారాన్ని చూపాలన్నారు. నిబంధనల మేరకు ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, నిబంధనల మేరకు లేని దరఖాస్తులకు సంబంధిత కారణాలను స్పష్టంగా దరఖాస్తుదారుడికి తెలియజేయాలని సూచించారు. వివిధ శాఖల్లో నమోదైన అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సమస్యకు తగిన పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. అర్జీల పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కూడా జేసీ ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జేసీకి వినతిపత్రం నిర్దేశించిన సమయంలోగా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు జేసీ ఆదేశం