
హైవే పక్కన ఆక్రమణల తొలగింపు
● ఫెన్సింగ్ తొలగించి దుకాణాలు ఏర్పాటు చేస్తే చర్యలు
● రూట్ ఆఫీసర్ నరసింహారావు హెచ్చరిక
ఒంగోలు సబర్బన్: ఆరు లైన్ల జాతీయ రహదారి పక్కన నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని సింహపురి ఎక్స్‌ప్రెస్ హైవే రూట్ ఆఫీసర్ కే నరసింహారావు హెచ్చరించారు. 16వ నంబర్ జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ దాటి స్పీడ్ రోడ్డు మార్జిన్‌లో నిబంధనలకు విరుద్ధంగా పంక్చర్ షాపులు, దుకాణాలు, హోటళ్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఒంగోలులోని పెళ్లూరు వద్ద హైవే మార్జిన్‌లో ఏర్పాటు చేసిన దుకాణాలను ఆదివారం హైవే సిబ్బందితో తొలగించారు. దుకాణాలున్న ప్రాంతాల్లో వాహనాలను రోడ్డు మీద నిలిపివేస్తుండటంతో ఇటీవల ప్రమాదాలు జరిగాయన్నారు. స్పీడ్ రహదారి కావడంతో జాతీయ రహదారుల నిబంధనల ప్రకారం ఫెన్సింగ్‌కు నష్టం కూడా చేయకూడదన్నారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హైవే మార్జిన్లలో ఎక్కడా వాహనాలు నిలపరాదన్నారు. అలాంటిది ఏకంగా పంక్చర్ షాపులు, టీ, టిఫిన్ హోటళ్లు ఏర్పాటు చేయడం, వాటి వద్ద వాహనాలు నిలుపుతుండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. అందుకోసం రోడ్డు మార్జిన్లలో దుకాణాలు నిర్వహిస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చి హైవే నిబంధనలను వివరించారు. దీనిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని నరసింహారావు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు సీహెచ్ నరసింహులు, సిబ్బంది మహేష్, మోహన్‌బాబు, రాబర్ట్, తదితరులు పాల్గొన్నారు.