
యోగా మాసోత్సవాలు విజయవంతం చేయాలి
ఒంగోలు సబర్బన్: యోగా మాసోత్సవాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో కలసి అన్ని శాఖల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. శ్రీయోగాంధ్ర–2025శ్రీ మాసోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతోపాటు ముందస్తు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహించాలి, అందుకు చేపట్టవలసిన చర్యలపై గ్రామ, మండల, జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికలు రుపొందించాలని సూచించారు. నెల రోజులపాటు సాగే ఈ కార్యక్రమంలో ఒక్కో రోజు ఒక్కో జిల్లాలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఉంటుందన్నారు. అందులో భాగంగా జూన్ 18వ తేదీన 5 వేల మంది స్వయం సహాయక సభ్యులతో యోగా కార్యక్రమాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో ముఖ్యమైన పర్యాటక కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేకంగా యోగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మే 26వ తేదీ, జూన్ 2, 8, 15వ తేదీల్లో జిల్లాలోని పర్యాటక ప్రదేశాల్లో కనీసం వేయి మందితో యోగా సాధన చేయించాలని చెప్పారు. యోగాపై గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించాలని సూచించారు. రోజూ ఉదయం 6 నుంచి 7 గంటల వరకు జిల్లాలోని గ్రామాలు, నగర పాలక సంస్థ, మున్సిపాలిటీల్లో ప్రజలతో రోడ్లపై యోగా సాధన చేయించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో 100 మంది మాస్టర్ ట్రైనర్లు, మండల స్థాయిలో 200 మంది ట్రైనర్లను గుర్తించి జాబితా రుపొందించాలని ఆయుష్ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. యోగా శిక్షణ కోసం జిల్లాలోని ప్రజలందరూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యేకించి మండల స్థాయిలో మహిళా స్వయం సహాయక సంఘాలు, ఉపాధి హామీ కూలీలు, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఎస్‌హెచ్‌జీ, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ఇలా అందరినీ సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రజలంతా ఈ నెల రోజులపాటు నిర్వహించే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, అంతర్జాతీయ యోగా వేడుకలను వివిధ సంస్థలు, మీడియా సహకారంతో విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, ఆయుష్ శాఖ ఆర్‌డీడీ పద్మజాతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, యోగా సాధకులు పాల్గొన్నారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియా
యోగాంధ్ర–2025పై జిల్లా
అధికారులతో సమీక్ష